Ayyappa Irumudi | రవితేజ ఇరుముడి..అసలు అయ్యప్ప భక్తుల ఇరుముడి వెనుక ఇంత మహత్యమా!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ayyappa Irumudi | ఇది అయ్యప్ప మాలధారణ సమయం​ కాకున్నా.. ఇరుముడి చిత్రం అన్​సీజన్​లో విడుదలైనా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. థియేటర్లు ఆధ్యాత్మిక చింతన​తో మార్మోగుతున్నాయి.

టాలీవుడ్‌లో మాస్‌ మహారాజా రవితేజ Raviteja నటించిన ‘ఇరుముడి’ సినిమా పేరు ప్రస్తుతం సినీ వర్గాల్లోనే కాదు.. సోషల్‌ మీడియాలోనూ ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమా టైటిల్‌ విన్న వెంటనే అయ్యప్ప భక్తులకు మాత్రం మరో భావన గుర్తుకొస్తుంది. ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ అనే భక్తి భావం కళ్లముందు మెదులుతుంది.

అసలు ఇరుముడి అంటే ఏమిటి? అయ్యప్ప దీక్షలో దానికి ఎందుకంత ప్రాధాన్యం? తలపై పెట్టుకుని శబరిమల వరకు ఎందుకు తీసుకెళ్తారు? దానిలో ఏముంటాయి? నెయ్యి కొబ్బరికాయకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇరుముడితోనే 18 పవిత్ర మెట్లు ఎక్కడానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే అయ్యప్ప దీక్షలోని ఆధ్యాత్మిక భావనను అర్థం చేసుకోవాలి.

Ayyappa Irumudi | రెండు భాగాల పవిత్ర మూట

‘ఇరుముడి’ అనే పేరులోనే దాని రూపం దాగి ఉంది. అయ్యప్ప భక్తుడు శబరిమల యాత్ర కోసం సిద్ధం చేసుకునే ఈ పవిత్ర మూటకు రెండు భాగాలు ఉంటాయి. ముందుభాగంలో స్వామికి సమర్పించాల్సిన పూజా ద్రవ్యాలు, నెయ్యితో నింపిన కొబ్బరికాయ వంటి వస్తువులను ఉంచుతారు. వెనుక భాగంలో భక్తుడి ప్రయాణానికి, వివిధ పుణ్యక్షేత్రాల్లో సమర్పణకు ఉపయోగించే వస్తువులను ఉంచే సంప్రదాయం ఉంది.

శబరిమల అధికారిక వివరాల ప్రకారం, ఇరుముడి కట్టే ప్రక్రియను గురుస్వామి సహాయంతో నిర్వహిస్తారు. ఇరుముడిని ధరించిన భక్తులకే పతినెట్టాంపడి అంటే పవిత్రమైన 18 మెట్లు ఎక్కే అర్హత ఉందని సంప్రదాయం చెబుతోంది.

akshara today copy.jpgiru

Ayyappa Irumudi | ఇరుముడిలో అత్యంత పవిత్రమైనది

ఇరుముడిలో నెయ్యితో నింపే కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ కొబ్బరికాయలోని నీటిని తొలగించి, ఆ స్థానంలో నెయ్యిని నింపుతారు. దీనిని ‘నెయ్యి కొబ్బరికాయ’ లేదా ‘నెయ్యి తేంగా’గా పిలుస్తారు.

ఇది కేవలం ఒక పూజా వస్తువు మాత్రమే కాదని అయ్యప్ప సంప్రదాయం భావిస్తుంది. మనసులోని ప్రాపంచిక కోరికలు, అహంకారాన్ని తొలగించి.. భక్తి, పవిత్రతను నింపుకోవడానికి ప్రతీకగా దీన్ని భావిస్తారు. శబరిమల అధికారిక వివరాల్లోనూ ఈ ప్రతీకాత్మక భావనను ప్రస్తావించారు.

Ayyappa Irumudi | ఇరుముడి కట్టడంలో గురుస్వామి పాత్ర

అయ్యప్ప దీక్షలో గురుస్వామికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అనుభవజ్ఞుడైన గురుస్వామి మార్గదర్శకత్వంలోనే భక్తుడు దీక్ష, యాత్రకు సంబంధించిన ఆచారాలను పాటిస్తాడు.

శబరిమల అధికారిక సమాచారం ప్రకారం.. 41 రోజుల వ్రతం, మాలధారణ, నియమ నిష్ఠల అనంతరం ఇరుముడిని గురుస్వామి సహాయంతో సిద్ధం చేసుకుని యాత్రకు బయలుదేరే సంప్రదాయం ఉంది.

అంటే ఇరుముడి కట్టడం అనేది ఒక మూటను సిద్ధం చేసుకోవడం మాత్రమే కాదు.. దీక్షను పూర్తి చేసి స్వామి దర్శనానికి బయలుదేరుతున్నామనే ఆధ్యాత్మిక సంకల్పానికి గుర్తు.

Ayyappa Irumudi | 18 మెట్లతో ఇరుముడికి సంబంధం ఏమిటి?

శబరిమల యాత్రలో అత్యంత భావోద్వేగమైన ఘట్టాల్లో పతినెట్టాంపడి ఒకటి. స్వామి సన్నిధికి చేరే ముందు భక్తులు పవిత్రమైన 18 మెట్లను ఎక్కుతారు.

AI Shiva Song Balochistan | నెట్టింట మార్మోగుతున్న’శివ బోలో.. బలూచిస్తాన్ ఆజాద్’: ఏఐ సృష్టించిన అద్భుత ఆధ్యాత్మిక, సాంస్కృతిక గీతం!

అయ్యప్ప సంప్రదాయంలో ఇరుముడి ధరించిన భక్తుడికి ఈ మెట్లకు ప్రత్యేక సంబంధం ఉంది. ఇరుముడి మోసే భక్తులే 18 మెట్లు ఎక్కి సన్నిధానం చేరుతారు. ఇరుముడి లేని భక్తుల దర్శనానికి వేరే మార్గం ఉంటుంది.

అందుకే ఇరుముడి భక్తుడి తలపై ఉన్నంతసేపూ.. ప్రతి అడుగు శరణుఘోషతో నిండిపోతుంది. చివరకు 18 మెట్లను అధిరోహించి స్వామి దర్శనం చేసుకోవడం యాత్రలో అత్యంత పవిత్రమైన ఘట్టంగా భావిస్తారు.

akshara today .jpg irumudi

Ayyappa Irumudi | తలపై మోసేది ఒక సంకల్పం

అయ్యప్ప ఆరాధన, శబరిమల యాత్రా సంప్రదాయాలతో ముడిపడిన పురాతన ఆచారమైన ఇరుముడి అంటే ఒక సంకల్పం. అయ్యప్ప భక్తుడి దృష్టిలో ఇరుముడి కేవలం రెండు భాగాలుగా కట్టిన ఒక మూట కాదు. అది దీక్షకు గుర్తు.. నియమానికి ప్రతీక.. సమర్పణకు సంకేతం.

యాత్రలో భక్తుడు తన శరీరాన్ని, మనసును నియంత్రించుకుంటూ ముందుకు సాగుతాడు. తలపై ఇరుముడి.. నోట ‘స్వామియే శరణం అయ్యప్ప’.. అడుగడుగునా స్వామి స్మరణ.. చివరికి శబరిమల సన్నిధానం.

అందుకే ఇరుముడి ప్రయాణం ఒక భౌతిక ప్రయాణం కంటే ఆధ్యాత్మిక ప్రయాణం అనే భావన అయ్యప్ప భక్తుల్లో బలంగా ఉంది.

మొత్తం మీద రవితేజ సినిమా ‘ఇరుముడి’ టైటిల్‌ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటే.. అదే పదం కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు మాత్రం దీక్ష, భక్తి, నియమం, సమర్పణను గుర్తుచేస్తుంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *