అక్షరటుడే, వెబ్‌డెస్క్: High Court Judgments | దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో తీర్పుల వెల్లడిలో జరుగుతున్న సుదీర్ఘ ఆలస్యానికి అడ్డుకట్ట వేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు లభించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి, దేశంలోని అన్ని హైకోర్టులు కచ్చితంగా పాటించాల్సిన పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. జార్ఖండ్ హైకోర్టులో తీర్పుల ప్రకటన, వెబ్‌సైట్లలో వాటి అప్‌లోడింగ్‌లో జరుగుతున్న విపరీతమైన ఆలస్యంపై దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది.
High Court Judgments | రిజర్వ్ తీర్పులకు 3 నెలల డెడ్‌లైన్..
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ సరికొత్త నిబంధనల ప్రకారం.. హైకోర్టులు తాము రిజర్వ్ చేసిన తీర్పులను (Reserved Judgments) గరిష్ఠంగా మూడు నెలల లోపు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ప్రజలు న్యాయం కోసం ఆశ్రయించే ప్రాథమిక సంస్థలు హైకోర్టులేనని, అందువల్ల సకాలంలో తీర్పులు ఇవ్వడం అత్యంత ఆవశ్యకమని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, ఈ గైడ్‌లైన్స్ ఏ ఒక్క వ్యక్తిగత న్యాయమూర్తిని లేదా వ్యవస్థను విమర్శించడానికి ఉద్దేశించినవి కావని కోర్టు స్పష్టం చేసింది.

High Court Judgments | బెయిల్ పిటిషన్లపై సంచలన ఆదేశాలు..
ముఖ్యంగా బెయిల్ దరఖాస్తుల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలక నిర్ణయాలు ప్రకటించింది. బెయిల్ అభ్యర్థనలపై సాధ్యమైనంత వరకు విచారణ జరిగిన రోజే ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఆర్డర్‌ను రిజర్వ్ చేస్తే మరుసటి రోజే దానిని కచ్చితంగా ప్రకటించాలని స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను తక్షణమే లోయర్ కోర్టులకు సమాచారం అందించాలని, బెయిల్ పొందిన విచారణ ఖైదీలను (Undertrial Prisoners) అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, అదే రోజు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

High Court Judgments | 24 గంటల్లోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్..
సాంకేతికతను వాడుకుంటూ పారదర్శకతను పెంచేందుకు వీలుగా.. న్యాయస్థానాలు తీర్పులను ప్రకటించిన 24 గంటల లోపు వాటిని ఆయా హైకోర్టుల అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి అని ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా, ఒక తీర్పులోని ప్రధాన కార్యాచరణ భాగాన్ని (Operative Part) ప్రకటించిన తేదీనే, ఆ తీర్పు వెల్లడించిన పూర్తి తేదీగా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయంతో ఇకపై హైకోర్టుల తీర్పుల్లో వేగం పెరగనుంది.
ఇది కూడా చదవండి: NMMS App Issues | గుండును గుర్తించని యాప్.. ఉపాధి కూలీల ‘యాప్’ కష్టాలు


