Trump 250 Note | ట్రంప్ చిత్రంతో 250 డాలర్ల నోటు.. అమెరికాలో సంచలన ప్రతిపాదనపై చర్చలు!

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Trump 250 Note | అమెరికా తన 250వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చిత్రంతో ప్రత్యేక 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావాలనే ఆలోచన సంచలనంగా మారింది.

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న స్వాతంత్య్ర‌ వేడుకల్లో భాగంగా ప్రత్యేక స్మారక కార్యక్రమాలను చేపడుతున్న అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ట్రంప్ చిత్రంతో బంగారు నాణేలను విడుదల చేసే యోచనలో ఉందని సమాచారం. ఇప్పుడు అదే తరహాలో ప్రత్యేక కరెన్సీ నోటుపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న కరెన్సీ చట్టాల ప్రకారం జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలను అమెరికన్ డాలర్లపై ముద్రించరాదు.

Trump 250 Note | అనుమ‌తి ల‌భిస్తుందా?

1866లో అమల్లోకి వచ్చిన ఈ నిబంధన అమెరికా కరెన్సీ చరిత్రలో కీలకమైనదిగా భావిస్తారు. అయితే ట్రంప్ చిత్రంతో నోటు విడుదల చేయాలంటే ఈ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకే అమెరికా కాంగ్రెస్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకునే దిశగా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే అమెరికా చరిత్రలోనే జీవించి ఉన్న వ్యక్తి చిత్రంతో కరెన్సీ విడుదలైన తొలి ఘటనగా ఇది నిలిచిపోతుంది. ఇప్పటికే అమెరికా ట్రెజరీ విభాగానికి చెందిన అధికారులు ఈ నోటుకు సంబంధించిన నమూనాలను సిద్ధం చేయాలని బ్యూరో ఆఫ్ ఎంగ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ అధికారులకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Trump 250 Note | మూడేళ్లలోనే గరిష్ట స్థాయికి..

ఇక ఈ నిర్ణయంపై అమెరికా (America)లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ అభిమానులు దీనిని చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తుండగా.. ప్రతిపక్ష వర్గాలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక సమస్యల మధ్య ఇలాంటి ప్రతిపాదనలు ప్రజల్లో తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితులు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తాజా గణాంకాల ప్రకారం నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండగా.. ద్రవ్యోల్బణం కూడా గత మూడేళ్లలోనే గరిష్ట స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కొత్త కరెన్సీ నోట్ల విడుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తోంది.

Trump 250 Note

అమెరికా రాజకీయాల్లో ఇప్పటికే సంచలన నాయకుడిగా గుర్తింపు పొందిన ట్రంప్ పేరు ఇప్పుడు కరెన్సీ నోటుపై కనిపించే అవకాశముందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇది కూడా చదవండి..: Blue Origin Explosion | రాకెట్‌ లాంచ్‌ ప్యాడ్‌ పేలుడు.. తప్పిన ప్రమాదం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *