అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Financial Discipline Tips | సానుకూల ఆలోచనలు ఎప్పుడూ సానుకూల ఫలితాలనే ఇస్తాయని పెద్దలు చెబుతుంటారు. మనం చేసే పనులు, ఎంచుకునే లక్ష్యాలకే కాదు.. డబ్బు విషయంలోనూ ఈ సూత్రం వంద శాతం వర్తిస్తుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా, పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకు సాగడం వల్ల ఎలాంటి డబ్బు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అంతేకాదు, ఇది భవిష్యత్తుకు గట్టి ఆర్థిక భరోసా (Financial Security)ను కూడా అందిస్తుంది. మరి ఆ సులభమైన పద్ధతులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Financial Discipline Tips | ఇతరులతో పోలికలు వద్దు
కొంతమంది ప్రతి చిన్న విషయానికి తమను ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఆస్తులు, వస్తువులు.. ఇలా ఏవైనా సరే, తమకు ఉండి ఇతరులకు లేని వాటిని సంతోషంగా ఆస్వాదించడం మర్చిపోతారు. కేవలం ఎదుటివారి వద్ద ఏముందో వాటిపైనే దృష్టి పెడతారు. ఈ క్రమంలో తమ ఆర్థిక స్తోమతను కూడా లెక్కచేయకుండా, గొప్పల కోసం అవసరానికి మించి అప్పులు (Debts) చేయడానికి వెనకాడరు. దీనివల్ల డబ్బు వృథా అవ్వడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం ఆపి.. ముందు మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో గమనించాలి. మన ఆదాయాన్ని బట్టి ఖర్చులు, పొదుపు, పెట్టుబడులను ప్లాన్ చేసుకుంటే అప్పులపాలయ్యే ముప్పు తప్పుతుంది.
Financial Discipline Tips | సాధ్యాసాధ్యాలను పరిశీలించాకే నిర్ణయం
ఏ పనైనా లేదా ఏ వస్తువునైనా కొనేముందు మన ఆర్థిక పరిస్థితికి అది సాధ్యమేనా కాదా అని అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు.. మన స్తోమతకు తగ్గట్టుగా ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలో ముందే లెక్క వేసుకోవాలి. సమాజంలో గొప్పల కోసం పోకుండా, మన వద్ద ఉన్న డబ్బును బట్టే ఇంటీరియర్ పనులు చేయించుకోవడం లేదా వస్తువులు కొనుక్కోవడం చేయాలి. ఇలా పరిమితులకు లోబడి అడుగులు వేయడం వల్ల ఎలాంటి మానసిక ఒత్తిళ్లు లేకుండా భవిష్యత్ లక్ష్యాలను నెమ్మదిగా పూర్తిచేసుకోవచ్చు.
Financial Discipline Tips | మహిళలు ఈ పొరపాట్లు చేయవద్దు
ఆర్థిక విషయాల్లో కొంతమంది మహిళలు చేసే కొన్ని పొరపాట్లు కూడా వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బు వ్యవహారాలన్నింటినీ పూర్తిగా భర్త లేదా కుటుంబ సభ్యుల చేతుల్లోనే పెట్టేయడం, తమకంటూ ప్రత్యేకంగా ఎలాంటి పొదుపు లేదా పెట్టుబడులు చేసుకోకుండా కేవలం భాగస్వామిపైనే ఆధారపడడం మంచిది కాదు. ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించినా.. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ‘అప్పుడే జాగ్రత్తపడి ఉంటే బాగుండేది’ అని బాధపడాల్సి వస్తుంది. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం సానుకూల ఆలోచనలతో సొంతంగా కొంత డబ్బు పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
Financial Discipline Tips | ఇతరుల మాటలకు ప్రభావితం కావద్దు
ఆర్థిక విషయాల్లో మనకంటూ సొంత ప్రణాళికలు, లక్ష్యాలు ఉన్నప్పటికీ.. ఒక్కోసారి ఇతరులు చెప్పే మాటలు లేదా వారు చేసే పనులు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఫలితంగా మన స్తోమతకు మించి ఖర్చు పెట్టేలా, అనవసరమైన జల్సాలకు అలవాటు పడేలా అవి ప్రేరేపిస్తాయి. దీనివల్ల కూడా లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి, మనల్ని తప్పుదోవ పట్టించే వ్యక్తుల మాటలను అస్సలు పట్టించుకోవద్దు. ఆర్థిక విషయాల్లో ఎల్లప్పుడూ సానుకూల సలహాలు ఇచ్చే వ్యక్తులతోనే స్నేహం చేయడం, మన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.
దీనిని కూడా చదవండి : Meta IT Notice | చిన్నారుల అశ్లీల వీడియోలు.. మెటాకు నోటీసులు జారీ చేసిన కేంద్రం