Red Sky in Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో వింత దృశ్యం.. ఎరుపు రంగులోకి మారిన ఆకాశం.. అసలు కారణం ఇదేనా?

ఛత్తీస్‌గఢ్‌లో ఆకాశం ఒక్కసారిగా రక్తపు రంగులో మారిపోవడం స్థానికులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Red Sky in Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో ఆకాశం ఒక్కసారిగా రక్తపు రంగులో మారిపోవడం స్థానికులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసింది. ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావంతో ఆ ప్రాంతంలో వీస్తున్న ఈదురుగాలులు, మారుతున్న వాతావరణ పరిస్థితుల నడుమ ఈ అరుదైన వింత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశం ఎర్రగా మారిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో దీని వెనుక అసలు కారణమేమిటనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

Red Sky in Chhattisgarh |తుఫాన్ ఎఫెక్ట్..

మధ్య భారత్‌లోకి అర్నబ్ తుఫాన్ అవశేషాలు (రెమ్నెంట్స్) ప్రవేశించడంతో భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుఫాను ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా ఇలాంటి వాతావరణ పరిస్థితుల సమయంలోనే ఆకాశం ఈ విధంగా రంగు మారడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈ వింత రంగు మార్పునకు తుఫాన్ వాతావరణం కొంతవరకు కారణం కావచ్చని భావిస్తున్నప్పటికీ.. తుఫాన్‌కు, ఈ ఎరుపు రంగు ఆకాశానికి ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Red Sky in Chhattisgarh | శాస్త్రీయ కారణం ఇదే..

సాధారణంగా సూర్యకాంతి వాతావరణంలోని కణాలు, అణువుల ద్వారా చెల్లాచెదురైపోవడాన్ని ‘స్కాటరింగ్’ అంటారు. సూర్యోదయం లేదా సూర్యాస్తమయ వేళల్లో కాంతి వాతావరణంలో సుదూర ప్రాంతం ప్రయాణించాల్సి వస్తుంది. ఆ సమయంలో తక్కువ తరంగదైర్ఘ్యం (Wavelength) ఉన్న నీలం రంగు కాంతి పూర్తిగా చెల్లాచెదురైపోతుంది. కానీ, ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న ఎరుపు , నారింజ రంగులు మాత్రం మన కంటికి స్పష్టంగా కనిపిస్తాయి. దీనినే శాస్త్రీయంగా ‘రేలీ స్కాటరింగ్’ (Rayleigh scattering) అంటారు.

దీనికి తోడు గాలిలో దుమ్ము, పొగ, తేమ లేదా నీటి బిందువులు వంటి పెద్ద కణాలు ఉన్నప్పుడు ఎరుపు రంగు తీవ్రత మరింత పెరుగుతుంది. తుఫాన్ మేఘాలు, దుమ్ము ధూళి, వెలుతురు-నీడల వింత కలయిక కారణంగానే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆకాశం ఇలా అత్యంత భయానకంగా ఎర్రటి రంగులో కనిపిస్తుంటుంది. ఏదేమైనప్పటికీ దీనిపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నారు. ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండి, అధికారులు సూచించిన భద్రతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  PCC Chief Mahesh Goud | రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం : పీసీసీ చీఫ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *