అక్షరటుడే వెబ్‌డెస్క్: Blenrep Multiple Myeloma | మల్టిపుల్ మైలోమా (రక్త క్యాన్సర్)తో బాధపడుతున్న రోగుల కోసం గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK ఇండియా) భారత్‌లో సరికొత్త క్యాన్సర్ చికిత్స ‘బ్లెన్‌రెప్’ (బెలాంటమాబ్ మఫోడోటిన్)ను విడుదల చేసింది. గతంలో కనీసం ఒకసారి చికిత్స పొందినప్పటికీ వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని వయోజన రోగులకు కాంబినేషన్ థెరపీగా దీనిని అందించడానికి అనుమతి లభించింది. బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్ (BCMA)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే తొలి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్ (ADC)గా ఇది నిలుస్తోంది. భారత్‌లో జీఎస్‌కే ప్రవేశపెడుతున్న మూడో ప్రెసిషన్ ఆంకాలజీ చికిత్స ఇది.
Blenrep Multiple Myeloma | మల్టిపుల్ మైలోమా తీవ్రత..
ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యంత సాధారణ రక్త క్యాన్సర్‌గా మల్టిపుల్ మైలోమా గుర్తింపు పొందింది. గ్లోబోకాన్ గణాంకాల ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.96 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, భారత్‌లో 17,529 కొత్త కేసులు (మొత్తం క్యాన్సర్ కేసులలో 1.1%) వెలుగుచూశాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయుల్లో ఒక దశాబ్దం ముందుగానే ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. పూర్తిగా నయం కానప్పటికీ చికిత్సతో దీర్ఘకాలం నియంత్రించగల ఈ వ్యాధికి, పదేపదే తిరగబెట్టే స్వభావం ఉండటం వల్ల సమర్థవంతమైన చికిత్సల అవసరం ఏర్పడింది.
Blenrep Multiple Myeloma | మెరుగైన ఫలితాలు..
DREAMM క్లినికల్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించిన DREAMM-7, DREAMM-8 ఫేజ్-III అధ్యయనాల్లో బ్లెన్‌రెప్ అద్భుత ఫలితాలు సాధించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రామాణిక చికిత్సలతో పోలిస్తే, దీని ద్వారా వ్యాధి పురోగతి లేకుండా జీవించే కాలం (PFS) దాదాపు మూడు రెట్లు పెరిగింది.
DREAMM-7 ట్రయల్: బోర్టెజోమిబ్, డెక్సామెథాసోన్‌లతో కలిపి బ్లెన్‌రెప్ ఇచ్చినప్పుడు మధ్యస్థ వ్యాధి పురోగతి-రహిత మనుగడ 36.6 నెలలుగా నమోదైంది (తులనాత్మక చికిత్సలో ఇది 13.4 నెలలే). వ్యాధి ముదిరే లేదా మరణించే ప్రమాదం 59 శాతం తగ్గింది.
DREAMM-8 ట్రయల్: పోమాలిడోమైడ్ ( Pomalidomide ), డెక్సామెథాసోన్‌లతో కలిపి అందించినప్పుడు 32.6 నెలల మధ్యస్థ PFS నమోదైంది (తులనాత్మక చికిత్సలో 12.5 నెలలు). వ్యాధి పురోగతి లేదా మరణ ముప్పు 51 శాతం తగ్గింది.
Blenrep Multiple Myeloma | రోగులకు ఆర్థిక చేయూత..
ఈ ఔషధాన్ని ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే, కేవలం 30 నిమిషాల పాటు ఔట్‌పేషెంట్ విధానంలో ఇన్ఫ్యూజన్ ద్వారా అందిస్తారు. కంటికి సంబంధించిన దుష్ప్రభావాలు ఏర్పడినా అవి ముందుగా అంచనా వేయగలిగేవిగా, తిరిగి సాధారణ స్థితికి వచ్చేవిగా ఉంటాయని, మోతాదు మార్పులతో వాటిని నియంత్రించవచ్చని సంస్థ తెలిపింది. అర్హులైన రోగులకు చికిత్స ఖర్చు భారం తగ్గించేందుకు ‘జీఎస్‌కే ఫీనిక్స్ పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్’ ద్వారా చేయూత అందిస్తున్నారు.
Blenrep Multiple Myeloma | క్యాన్సర్ సంరక్షణలో కీలక ముందడుగు..
గతేడాది జెంపెర్లీ, జెజులా ఔషధాలతో భారత్‌లో ఆంకాలజీ ప్రయాణం ప్రారంభించామని, ఇప్పుడు బ్లెన్‌రెప్ ద్వారా హెమటో-ఆంకాలజీ విభాగంలోకి విస్తరిస్తున్నామని జీఎస్‌కే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ అక్షికర్ తెలిపారు. వ్యాధి జీవశాస్త్ర లక్షణాల ఆధారంగా పనిచేస్తూ, నేరుగా క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవడమే బ్లెన్‌రెప్ ప్రత్యేకత అని సంస్థ ఈవీపీ (మెడికల్ అఫైర్స్) డాక్టర్ షాలినీ మీనన్ వివరించారు.
ఇది కూడా చదవండి: Seethakka Apology | కవితకు క్షమాపణ చెప్పిన మంత్రి సీతక్క