Supreme Court on Remission | దోషికి శిక్ష తగ్గింపు ఇచ్చే ముందు బాధితుల వాదన వినాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

బెయిల్, అప్పీల్ దశల్లో బాధితులకు ఉన్న హక్కు, దోషి విడుదల సమయంలో ఎందుకు ఉండకూడదని నిలదీసింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court on Remission | నేర న్యాయ వ్యవస్థలో (Criminal Justice System) బాధితుల హక్కులకు పెద్దపీట వేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు వంటి శిక్షలు అనుభవిస్తున్న దోషులకు ముందస్తు విడుదల (Premature Release) లేదా శిక్షా కాలం తగ్గింపు (Remission) మంజూరు చేసే ముందు, ఆ కేసులోని బాధితులు లేదా వారి చట్టపరమైన ప్రతినిధుల వాదనను కచ్చితంగా వినాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఐఏఎస్ అధికారి హత్య కేసులో మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌కు బిహార్ ప్రభుత్వం ఇచ్చిన శిక్షా తగ్గింపును రద్దు చేస్తూ, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

Supreme Court on Remission | ట్రయల్‌తోనే బాధితుల పాత్ర ముగిసిపోదు

నేర విచారణ ముగిసి, దోషికి శిక్ష పడినంత మాత్రాన న్యాయ ప్రక్రియలో బాధితుల పాత్ర ముగిసిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషిని శిక్షా కాలం పూర్తికాకముందే విడుదల చేయడం అనేది బాధితులు, వారి కుటుంబ సభ్యుల భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

నూతన క్రిమినల్ చట్టమైన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) లోని సెక్షన్ 473 కింద శిక్షా తగ్గింపు ప్రక్రియలో బాధితులకు నోటీసులు ఇచ్చి, వారి వాదన వినాలనే నిబంధన లేకపోవడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. బెయిల్, అప్పీల్ దశల్లో బాధితులకు ఉన్న హక్కు, దోషి విడుదల సమయంలో ఎందుకు ఉండకూడదని నిలదీసింది.

Supreme Court on Remission | జైళ్ల మాన్యువల్‌లో భాగంగా పరిగణించాలి

గుర్తించదగిన, అందుబాటులో ఉన్న బాధితులకు నోటీసులు జారీ చేసి, వారి అభ్యంతరాలు, ఆందోళనలను లిఖితపూర్వకంగా సమర్పించే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించింది. ఈ నిబంధనను జైళ్ల మాన్యువల్ (Prison Manual) లో అంతర్భాగంగా చదవాలని స్పష్టం చేసింది.

Supreme Court on Remission | బాధితులకు ‘వీటో’ అధికారం ఉండదు

ఈ ప్రక్రియలో బాధితుల వాదన వినడం అంటే ప్రభుత్వ నిర్ణయంపై వారికి ‘వీటో అధికారం’ (Veto Power) ఇచ్చినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

“దోషి విడుదల వల్ల తమకు ప్రాణహాని ఉందా? దోషి ప్రవర్తన ఎలా ఉంది? అనే అంశాలపై బాధితులు తమ ఆందోళనలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం మాత్రమే ఇది. అంతిమ నిర్ణయం చట్టం, రెమిషన్ పాలసీ ప్రకారం సంబంధిత అధికారులదే ఉంటుంది” అని ధర్మాసనం పేర్కొంది.

ఈ తీర్పుతో ఇకపై దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఖైదీలకు ముందస్తు విడుదల కల్పించాలంటే, బాధితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి కానుంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *