అక్షరటుడే, వెబ్డెస్క్: Karthika Somavaram 2026 | హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికతకు (Spirituality) అత్యంత ప్రాధాన్యం ఉంది. కార్తీకమాసంలో ఆచరించే నదీస్నానం (Holy Bath), దీపారాధన (Lighting Lamps), పూజలు, దానాలు విశిష్ట ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
‘శివ శివ’ అంటూ నామస్మరణ చేసినా.. ‘కార్తిక దామోదర’ అంటూ కీర్తించినా శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతుంటారు. సాధారణంగా ఈ మాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తున్నప్పటికీ, విష్ణుమూర్తి ఆరాధనకు కూడా ఇది అత్యంత ప్రధానమైన మాసమే. యుగయుగాల నుంచి ప్రత్యేకతను సంతరించుకున్న ఈ హరిహర ప్రియ మాసంలో భక్తకోటి కఠిన నిష్ఠతో ఆచరించే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
Karthika Somavaram 2026 | ఈ రోజు విశేషం ఏంటంటే…
ఈ మాసంలో సోమవారానికి ఉండే విశిష్టత అంతా ఇంతా కాదు. ఈశ్వరారాధనకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శివాలయాలలో రుద్రాభిషేకాలు (Rudrabhishekam), రుద్రపూజలు, లక్ష బిల్వదళాలతో అర్చనలు (Bilva Archana), అమ్మవారికి లక్షకుంకుమార్చనలు ఘనంగా జరుగుతుంటాయి.
ఇలా విశేష పూజలు నిర్వహించే భక్తులపై సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంగా నిలుస్తాడని నమ్ముతారు. కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రంతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి, ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి.
శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజున చేసే స్నానం, పూజ, జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం (Ashwamedha Yagna) చేసిన పుణ్య ఫలితాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
Karthika Somavaram 2026 | ఏకభుక్తం లేదా ఉపవాసం ఆచరించడం మంచిది…
ఈ ఏడాది కార్తీక మాస (Karthika Masam) మొదటి సోమవారం నవంబర్ 16వ తేదీన వచ్చింది. శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ‘కోటి సోమవారం’ రోజున చేసే పూజలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు.
శివాలయాలను సందర్శించడం, అభిషేకాలు చేయడం, అలాగే ఎవరి శక్తి మేరకు వారు ఉపవాసం (Fasting) లేదా ఏకభుక్తం (Single Meal) ఆచరించడం మంచిది. నవంబర్ 16న నిర్వహించే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం వంటి కార్యాలు రెట్టింపు ఫలితాలను ప్రసాదిస్తాయని చెబుతున్నారు.
ఈ నెల రోజుల పాటు, ముఖ్యంగా సోమవారం రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి శివయ్యను పూజిస్తారు. కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివుని పూజించి తమ ఉపవాస దీక్షను విరమిస్తారు.
Karthika Somavaram 2026 | కార్తీక సోమవారం ఆచరించాల్సిన విధానం..
- సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి.
- సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజా గదిలో దీపారాధన చేయాలి.
- నక్షత్ర దర్శనం తర్వాత మళ్లీ శివాలయానికి వెళ్లి పరమేశ్వరున్ని దర్శించుకుని అక్కడ కూడా దీపారాధన చేయాలి.
- ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో పఠించాలి.
- ఆరోగ్యరీత్యా ఉపవాస దీక్షను కొనసాగించలేనివారు ఆహారం తీసుకుని దీక్షను విరమించవచ్చు.
ఇది కూడా చదవండి..: Nov 15 Horoscope | నేటి రాశి ఫలాలు: ఈ 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే!