అక్షరటుడే వెబ్డెస్క్: Raksha Bandhan 2026 | అన్నాచెల్లెళ్ల అప్యాయతకు, ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్ర వేడుక రక్షాబంధన్. జీవితాంతం తోడుంటామనే భరోసాను ఇస్తూ అన్నాచెల్లెళ్లు జరుపుకునే ఈ రాఖీ పౌర్ణమి వేడుకలకు దేశం మొత్తం సిద్ధమవుతోంది. అయితే, ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ( Purnima ) తిథి సమయాలు, చంద్రగ్రహణం, భద్రకాలం వంటి అంశాలపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, ఏ సమయంలో రాఖీ కట్టాలనే అంశాలపై వేద పండితులు స్పష్టతనిచ్చారు.
Raksha Bandhan 2026 | ఎప్పుడు కట్టాలి?
హిందూ సంప్రదాయంలో పండుగల నిర్ణయానికి ఉదయ తిథి చాలా ముఖ్యం. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు మొదలై, ఆగస్టు 28న ఉదయం 9:48 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఉదయ తిథి నిబంధన ప్రకారం రక్షాబంధన్ వేడుకను ఆగస్టు 28న జరుపుకోవాలని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.
Raksha Bandhan 2026 | ఆందోళన వద్దు..
ఆగస్టు 28న వచ్చే చంద్రగ్రహణం భారత్లో కనిపించకపోవడం వల్ల ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేశారు. అలాగే భద్రకాలం ఆగస్టు 27 రోజు ఉదయమే ముగిసిపోతుంది కాబట్టి, ఆగస్టు 28న రాఖీ పండుగ జరుపుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అయితే, అదే రోజు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రాహుకాలం ఉన్నందున, స్థానిక సమయాలకు అనుగుణంగా మంచి ముహూర్తాన్ని ఎంచుకుని రాఖీ కట్టుకోవడం మంచిది.
Raksha Bandhan 2026 | దేశవ్యాప్తంగా విభిన్న వేడుకలు..
శ్రావణ పౌర్ణమిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా జరుపుకుంటారు. పశ్చిమ తీరంలో జాలర్లు వరుణ దేవుడికి కొబ్బరికాయలు సమర్పించి ‘నారలి పూర్ణిమ’ జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో పవిత్రమైన ‘ఉపాకర్మ’ నిర్వహిస్తారు. అలాగే మధ్య భారతదేశంలో రైతులు మంచి పంట దిగుబడిని కోరుకుంటూ ‘కజ్రీ పూర్ణిమ’గా పూజిస్తారు. బాధ్యతలు, పరస్పర రక్షణను గుర్తుచేసుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో నూతనోత్తేజాన్ని నింపుతుంది.
ఇది కూడా చదవండి: Nagarjuna Sagar | నాగార్జున సాగర్ నీటి విడుదల.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదం