Byju Raveendran Jail | బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు 6 నెలల జైలు శిక్ష

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Byju Raveendran Jail | ఎడ్‌టెక్ రంగంలో ఒకప్పుడు వెలిగిపోయిన ‘బైజూస్’ (Byju’s) సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కార కేసులో ఆయనకు సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. ఏప్రిల్ 2024 నుండి తన ఆస్తులకు సంబంధించి కోర్టు ఇచ్చిన పలు ఆదేశాలను పాటించకపోవడంతో రవీంద్రన్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జైలు శిక్షతో పాటు, అధికారుల ముందు లొంగిపోవాలని, S$90,000 (సుమారు రూ. 58 లక్షలు) కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. అలాగే ‘Beeaar Investco Pte’ అనే అనుబంధ సంస్థపై తనకున్న చట్టపరమైన యాజమాన్య పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై బైజూ రవీంద్రన్ స్పందిస్తూ.. ఇది తప్పుడు , ఏకపక్ష నిర్ణయమని, దీనిని ఊరికే వదిలిపెట్టబోమని ప్రకటించారు.

byjus.1

Byju Raveendran Jail | ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థతో వివాదం..

బైజూస్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన ఒక అనుబంధ సంస్థ (ఖతార్ హోల్డింగ్స్) సింగపూర్‌లో దాఖలు చేసిన కేసు వల్లే రవీంద్రన్‌కు ఈ శిక్ష పడింది. ప్రస్తుతం బైజూ రవీంద్రన్ సింగపూర్‌లో ఉన్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇప్పటికే అమెరికాలో 1.2 బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్న రవీంద్రన్‌కు ఈ సింగపూర్ కోర్టు తీర్పు మరింత సంక్షోభంలోకి నెట్టింది.

Byju Raveendran Jail | నేడు దివాలా దిశగా .

ఒకప్పుడు భారతదేశపు అతిపెద్ద స్టార్టప్ విజయగాథగా నిలిచిన బైజూస్, నేడు దివాలా దిశగా సాగుతోంది. 2011లో ‘థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’ (బైజూస్) ప్రారంభమైంది. దేశంలో పెరిగిన స్మార్ట్‌ఫోన్ వినియోగం, కరోనా లాక్‌డౌన్ కాలంలో ఆన్‌లైన్ విద్యకు పెరిగిన డిమాండ్‌ను వాడుకుని ఈ సంస్థ వేగంగా విస్తరించింది. ఒక దశలో దీని విలువ 22 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 1.8 లక్షల కోట్లు) చేరింది.
byjus.2

Byju Raveendran Jail | భారీ వ్యయాలు – ఆర్థిక నష్టాలు..

ఆకాష్, గ్రేట్ లెర్నింగ్, ఎపిక్ వంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలను కొనుగోలు చేయడం, సెలబ్రిటీలతో భారీ ప్రకటనలు ఇవ్వడం వంటి దూకుడు వ్యూహాలు కంపెనీపై ఆర్థిక భారాన్ని పెంచాయి. మహమ్మారి తగ్గిన తర్వాత ఆన్‌లైన్ క్లాసులకు డిమాండ్ తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో బైజూస్ సంక్షోభంలో పడింది. సకాలంలో ఆర్థిక నివేదికలు ఇవ్వకపోవడం కూడా అనుమానాలను పెంచింది.

Byju Raveendran Jail | బీసీసీఐ వివాదం ..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పాన్సర్‌షిప్ ఒప్పందంలో భాగంగా బైజూస్ దాదాపు రూ. 159 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు కట్టకపోవడంతో బీసీసీఐ రికవరీ చర్యలు చేపట్టింది. దీంతో బైజూస్ మాతృ సంస్థ ‘థింక్ & లెర్న్’ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (CIRP) లోకి వెళ్లాల్సి వచ్చింది. భారత్‌లో ఒక యూనికార్న్ స్టార్టప్ ఇలా దివాలా తీయడం ఇదే మొదటిసారి.

ఇది కూడా చదవండి: Vijaya Reddy Funeral | మాజీ మంత్రి సతీమణి పార్థీవదేహానికి పీసీసీ చీఫ్​ నివాళి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *