అక్షరటుడే, వెబ్డెస్క్: Electric Buses | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కూకట్పల్లి బస్ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 60 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ప్రజలకు పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో 2027 నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 960 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, అందులో హైదరాబాద్ నగరంలోనే 545 బస్సులు సేవలందిస్తున్నాయని తెలిపారు. మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
Electric Buses | ఢిల్లీలా మారకుండా..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో దశలవారీగా మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకు వస్తామని మంత్రి పేర్కొన్నారు. దీంతో 600 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ మరో ఢిల్లీలా కాలుష్య నగరంగా మారకుండా ఉండేందుకే ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో పలు సంస్కరణలు చేపట్టామని మంత్రి తెలిపారు. కొత్త నియామకాలు, కొత్త బస్సుల ప్రవేశంతో ఆర్టీసీ దేశంలోనే ఉత్తమ సంస్థగా నిలుస్తోందన్నారు.
Electric Buses | కార్మికుల సంక్షేమం కోసం..
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతి నెల రెండో మంగళవారం డీఎంలు, ఆర్ఎంలు మరియు ఇతర ఉన్నతాధికారులు కార్మికుల సమస్యలపై చర్చిస్తారని తెలిపారు. త్వరలోనే ఆర్టీసీ సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కేపీహెచ్బీలో కొత్త డిపో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని, సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు,
ఇది కూడా చదవండి..: Balka Suman Comments | బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యల దుమారం.. చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం


