భారత్‌లో అధునాతన ఎనర్జీ స్టోరేజ్ తయారీ.. బెంగళూరులో మిడ్‌వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం

Shivam nagarani

Midwest Energy BESS | క్లీన్ ఎనర్జీ రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటోంది. మిడ్‌వెస్ట్ బిజినెస్ హౌస్‌కు చెందిన ‘మిడ్‌వెస్ట్ ఎనర్జీ’ సంస్థ.. బెంగళూరులోని తన 1.2 GWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్ ద్వారా సెల్-టు-కంటైనర్ తయారీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. వాణిజ్య, పారిశ్రామిక, పునరుత్పాదక ఇంధన అవసరాలకు తగినట్లుగా బ్యాటరీ మోడ్యూల్స్, రాక్‌లు , కంటైనరైజ్డ్ సిస్టమ్స్‌ను ఇక్కడ తయారు చేయనున్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన వాడకం పెరుగుతున్న తరుణంలో, గ్రిడ్‌కు స్థిరమైన విద్యుత్ సరఫరా అందించడంలో ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ఎంతో కీలకం కానున్నాయి.

ప్లాంట్ ముఖ్య విశేషాలు..
మిడ్‌వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏడాదికి 1.2 GWh బ్యాటరీల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 3 kWh నుంచి 6 MWh (48V–1500V) వరకు విస్తృత శ్రేణిలో ఉత్పాదనను అందిస్తుంది. ఈ ఉత్పత్తులన్నీ అంతర్జాతీయ ప్రమాణాలైన UL 1973, UL 9540 , UL 9540A నిబంధనలకు అనుగుణంగా తయారవుతాయి. అంతేకాకుండా, కస్టమర్ల ప్రత్యేక అవసరాలకు తగ్గట్టుగా వీటిని మార్చుకునే (Customised) సౌలభ్యం కూడా అందుబాటులో ఉంది.

స్వదేశీ ఇంధన రంగానికి పెద్దపీట..
భారత్ వేగంగా స్వచ్ఛమైన ఇంధన రంగం వైపు అడుగులు వేస్తోందని, ఈ తరుణంలో గ్రిడ్ అస్థిరత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు BESS వ్యవస్థలు ఎంతో ఉపయోగపడతాయని మిడ్‌వెస్ట్ ఎనర్జీ సీఈఓ సౌమ్య కె తెలిపారు. పూర్తిగా దేశీయంగానే అధునాతన ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలను తయారు చేస్తూ, దేశ క్లీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగస్వామ్యం కావడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలకు తగ్గట్టుగా నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు ఈ ప్లాంట్ ఎంతగానో దోహదపడనుంది.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *