Water Tank | ట్యాంకు నీళ్లు వేడిగా మారాయా? ఈ ‘సిల్వర్’ ట్రిక్‌తో ఫ్రిజ్ వాటర్‌లా చల్లగా మార్చండిలా

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Water Tank | ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు జనాలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నా వేడి తగ్గడం లేదు. వీటన్నింటికీ మించి మధ్యాహ్నం వేళల్లో బాత్‌రూమ్‌లోకి వెళ్లిన సామాన్యుడికి మరో పెద్ద షాక్ తగులుతోంది. నల్లా తిప్పితే చాలు.. గీజర్ నుంచి వచ్చినట్టుగా వేడి నీరు ఉడుకుతూ వస్తోంది. మిద్దెపై నేరుగా ఎండ తగిలేలా ఉండే ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు (Plastic Water Tanks) విపరీతంగా హీట్ ఎక్కడం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది.

భారీ ఖర్చుతో కూలింగ్ షెడ్లు వేయలేని వారికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన, చౌకైన ఉపాయం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కిచెన్‌లో దొరికే ఒకే ఒక్క వస్తువుతో ట్యాంకు నీటిని ఫ్రిజ్‌లో నీళ్లలా చల్లగా ఉంచుకునే ఈ సరికొత్త దేశీ జుగాడ్  హ్యాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Water Tank | సూర్య కిరణాలకు ఎదురుదెబ్బ..

సాధారణంగా మనం వంటగదిలో చపాతీలు, ఇతర ఆహార పదార్థాలు వేడిగా ఉండటానికి సిల్వర్ రంగులో మెరిసే అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను వాడుతుంటాం. ఈ పేపర్‌కు అద్భుతమైన రిఫ్లెక్టివ్ (సూర్యకాంతిని వెనక్కి పంపే) గుణం ఉంది. దీనిపై తీవ్రమైన సూర్యకిరణాలు పడినప్పుడు, ఇది ఆ వేడిని గ్రహించకుండా 90 శాతం కంటే ఎక్కువ ఎండను తిరిగి ఆకాశంలోకి పరావర్తనం చేస్తుంది. ఫలితంగా ట్యాంక్ ప్లాస్టిక్ పొర వేడెక్కదు.

Water Tank | ఈ ‘కూలింగ్ ట్రిక్’ను అప్లై చేసే విధానం..

మొదటి పొర (ఇన్సులేషన్): అల్యూమినియం ఫాయిల్‌ను నేరుగా ట్యాంకుపై చుడితే అది గాలికి చినిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల మొదట ట్యాంకు చుట్టూ ఏదైనా పాత కాటన్ బెడ్‌షీట్, కాటన్ చీర లేదా జనపనార (Jute) బస్తాలను గట్టిగా చుట్టాలి. ఇది బయటి వేడి నేరుగా ప్లాస్టిక్‌కు తగలకుండా ఆపుతుంది.

రెండో పొర (ఫాయిల్ పేపర్) : ఇప్పుడు ఆ బస్తా లేదా గుడ్డపై అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను చుట్టాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫాయిల్ పేపర్ బాగా మెరిసే భాగాన్ని బయటి వైపుకు ఉంచాలి. ట్యాంక్ పైభాగం (మూత) నుండి కిందటి వరకు దీనిని పూర్తిగా కవర్ చేసి దారంతో లేదా టేపుతో కట్టేయాలి.

ఒక్క ట్రిక్ ఎన్నో లాభాలు : ఈ చిన్న హోమ్ హ్యాక్ వల్ల కేవలం నీరు చల్లగా ఉండటమే కాకుండా మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎండ తీవ్రతకు ప్లాస్టిక్ ట్యాంకులు పాడైపోకుండా, పగుళ్లు రాకుండా దీర్ఘకాలం ఉంటాయి. అలాగే ట్యాంకు లోపల నాచు (Algae) పట్టకుండా ఉంటుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ సింపుల్ ట్రిక్ ఈ వేసవి తాపానికి చక్కటి పరిష్కారమని చెప్పొచ్చు. మరి మీ ఇంట్లో కూడా ట్యాంక్ నీళ్లు వేడెక్కుతుంటే.. వెంటనే ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌ను ట్రై చేసి చూడండి.

ఇది కూడా చదవండి..: Pilgrimage Rules | తీర్థయాత్రల అసలు అంతరార్థం ఏంటి? పుణ్యస్నానాలు, దర్శనాల్లో పాటించాల్సిన పవిత్ర నియమాలివే

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *