KNR Illegal Wealth | జగన్ పీఏ కేఎన్‌ఆర్ ఆస్తులపై సిట్ దర్యాప్తు.. మూడు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తుల గుర్తింపు!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KNR Illegal Wealth | వైసీపీ ప్రభుత్వ కాలంలో అధికార కేంద్రాలకు అత్యంత సన్నిహితుడిగా ఎదిగిన జగన్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్‌ఆర్‌ (నాగేశ్వరరెడ్డి) ఆస్తుల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగిగా కేవలం పదివేల రూపాయల జీతంతో జీవించిన వ్యక్తి.. కొద్ది కాలంలోనే మూడు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ అధికారులు గుర్తించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.గురువారం విజయవాడ మాచవరం వెటర్నరీ కాలనీలో ఉన్న కేఎన్‌ఆర్ నివాసంలో సిట్ అధికారులు (SIT Officers) సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి కేఎన్‌ఆర్‌కు బినామీగా వ్యవహరించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలుస్తోంది. దీంతో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్న శివశంకర్ రెడ్డి నివాసానికి వెళ్లిన అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు.

KNR Illegal Wealth | మద్యం స్కామ్ నుంచి భూ సెటిల్మెంట్ల వరకూ

గత వైసీపీ ప్రభుత్వంలో వెలుగుచూసిన భారీ మద్యం స్కామ్‌లో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి కేఎన్‌ఆర్ పలు వ్యవహారాలు నడిపినట్లు సిట్ అనుమానిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా భూ సెటిల్మెంట్లు, రాజకీయ టికెట్ల వ్యవహారాల్లో భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో బయటపడుతోంది. విశాఖపట్నం విమానాశ్రయం (Visakhapatnam Airport) పరిసరాల నుంచి తిరుపతి వరకు ఎకరాలకు ఎకరాలు సెటిల్మెంట్ల ద్వారా సంపాదించుకున్నట్లు సమాచారం. తిరుమల కొండకింద హథీరామ్ జీ మఠానికి చెందిన భూముల వ్యవహారంలో కూడా అప్పటి వైసీపీ నేతలతో కలిసి కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

KNR Illegal Wealth | ఆశావహుల నుంచి కోట్ల రూపాయలు వసూలు

2019 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురు ఆశావహుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలుచోట్ల అభ్యర్థుల నుంచి భారీ మొత్తాలు తీసుకున్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.అంతేకాదు.. ఇప్పటికే పదవుల్లో ఉన్న నాయకులకు “మీపై ఇంటెలిజెన్స్, ఏజెన్సీ నివేదికలు నెగెటివ్‌గా వచ్చాయి” అంటూ భయపెట్టి కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతికి సమీప ప్రాంతాల్లో తక్కువ ధరలకు దాదాపు 40 ఎకరాల భూమిని కేఎన్‌ఆర్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్నం పరిసరాల్లో ప్రభుత్వ భూములు, ప్రైవేటు ఆస్తులు కూడా పెద్దఎత్తున కూడబెట్టినట్లు సమాచారం. హైదరాబాద్, బెంగళూరులో కూడా ఆయనకు విలాసవంతమైన ఇళ్లు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

KNR Illegal Wealth | కేఎన్‌ఆర్ భార్య ఖాతాల్లో భారీ మొత్తంలో లావాదేవీలు

KNR Illegal Wealth

విజయవాడ రామవరప్పాడులోని లక్కీ హ్యుందాయ్ (Lucky Hyundai) కార్ల షోరూమ్ వ్యవహారం కూడా ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో షోరూమ్‌పై రవాణాశాఖకు ఫిర్యాదులు రావడంతో.. సమస్య పరిష్కరిస్తానంటూ కేఎన్‌ఆర్ బలవంతంగా 51 శాతం వాటా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేఎన్‌ఆర్ భార్య ఖాతాల్లో భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.19.85 కోట్ల వరకు ట్రాన్సాక్షన్లు జరిగినట్లు సమాచారం. అలాగే భార్య కోసం సేకరించిన బంగారు ఆభరణాల బరువు రెండున్నర కిలోలకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కేఎన్‌ఆర్ బామ్మర్ది భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవహారంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి..: Revanth Reddy NTR | కేసీఆర్​కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే.. అందుకే ఆయన విగ్రహాన్ని నగర నడిబొడ్డున పెట్టాం.. సీఎం రేవంత్​!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *