అక్షరటుడే, వెబ్‌డెస్క్: Orange Cap Race | ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు మ్యాచ్‌లతో ఈ సీజన్‌కు తెరపడనుండగా.. టైటిల్ రేస్‌తో పాటు ఆరెంజ్ క్యాప్ పోరు కూడా అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ట్రోఫీపై కన్నేయగా.. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు ఫైనల్ బెర్త్ కోసం గట్టిగా పోరాడుతున్నాయి. అయితే జట్ల మధ్య పోటీ కంటే ఇప్పుడు వ్యక్తిగతంగా బ్యాటర్ల మధ్య జరుగుతున్న ఆరెంజ్ క్యాప్ వార్ మరింత హాట్ టాపిక్‌గా మారింది.
Orange Cap Race | వైభవ్ సూర్యవంశీ భారీ జంప్
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)కు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. మే 27న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు అతడు ఐదో స్థానంలో ఉన్నాడు. కానీ అదే మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లో 97 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో వైభవ్ ఒక్కసారిగా టాప్‌లోకి ఎగబాకాడు. మ్యాచ్‌కు ముందు అతని ఖాతాలో 583 పరుగులు ఉండగా.. ప్రస్తుతం 15 ఇన్నింగ్స్‌లలో మొత్తం 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను తన తలపై నిలబెట్టుకున్నాడు. అతడి దూకుడు చూసి క్రికెట్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది.
Orange Cap Race | ఫైనల్ బెర్త్ కోసమే కాదు..
వైభవ్ టాప్‌లోకి వచ్చినప్పటికీ పోరు ఇంకా పూర్తిగా ముగియలేదు. గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ 652 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు కేవలం 28 పరుగుల దూరంలో మాత్రమే ఉండటంతో క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో అతడు 15 ఇన్నింగ్స్‌లలో 759 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
ఇప్పుడు వరుసగా రెండోసారి ఆరెంజ్ క్యాప్ అందుకోవాలని అతడు పట్టుదలగా ఉన్నాడు. మే 29న రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు క్వాలిఫైయర్-2లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కేవలం ఫైనల్ బెర్త్ కోసమే కాదు.. ఆరెంజ్ క్యాప్ విజేతను నిర్ణయించే మ్యాచ్‌గా కూడా మారింది. ఒకవేళ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో 28 కంటే ఎక్కువ పరుగులు చేస్తే వైభవ్‌ను దాటేసి మళ్లీ టాప్‌లోకి వెళ్తాడు. అదే సమయంలో వైభవ్ మరో భారీ ఇన్నింగ్స్ ఆడితే అతడిని అందుకోవడం చాలా కష్టమవుతుంది.
ఇది కూడా చదవండి..: Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కన్నీరు పెట్టిన కావ్యమారన్


