Railway Doubling | నిజామాబాద్​ జిల్లాలో శరవేగంగా రైల్వే డబ్లింగ్‌ పనులు

దశాబ్ద కాలంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేడ్చల్– ముద్ఖేడ్​ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్​ పనులు వేగంగా సాగుతున్నాయి. గతేడాది ప్రారంభమైన పనులు ప్రస్తుతం నిజామాబాద్​ జిల్లా పరిధిలో వేగంగా సాగుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: Railway Doubling | దశాబ్ద కాలంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేడ్చల్– ముద్ఖేడ్ (medchal mudkhed railway)​ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్​ పనులు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్ల క్రితం మేడ్చల్–ముద్ఖేడ్​, మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబ్లింగ్ (Mahabubnagar–Dhone) ప్రాజెక్టులకు కలిపి నిధులు విడుదల చేసింది. అయితే గతేడాది ప్రారంభమైన పనులు ప్రస్తుతం నిజామాబాద్​ జిల్లా పరిధిలో వేగంగా సాగుతున్నాయి.

Railway Doubling | కేంద్ర ప్రభుత్వం నిధులు..

కేంద్ర ప్రభుత్వం మేడ్చల్–ముద్ఖేడ్​, మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులకు రూ.5,655.4 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో అత్యధిక భాగం మేడ్చల్–ముద్ఖేడ్​ మార్గానికే కేటాయించడం విశేషం. నిధుల విడుదల తర్వాత గతేడాది పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పరిధిలో డబ్లింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి.

Railway Doubling | ఇందల్వాయి–డిచ్​పల్లి ప్రాంతాల్లో..

ఇందల్వాయి(Indalwai), డిచ్‌పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా మరో లైన్ నిర్మాణం కోసం మట్టిపోసి కంకర చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి నిజామాబాద్, బాసర, నాందేడ్, షిర్డీ మీదుగా ముంబయి వరకు ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఎంతో మేలు జరుగనుంది.

Railway Doubling | రైళ్ల రాకపోకలకు మరింత వేగం

ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకు దాదాపు 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దేవగిరి ఎక్స్‌ప్రెస్, అజంతా ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్, జైపూర్, మధురై, విశాఖపట్నం, సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు ప్యాసింజర్, ఇంటర్‌సిటీ, లోకల్ రైళ్లు కూడా ఇదే మార్గాన్ని వెళ్తున్నాయి. అయితే ఒకే ట్రాక్ ఉండటం వల్ల ఎదురెదురుగా వచ్చే రైళ్లకు మార్గం కల్పించేందుకు అనేక స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా వడియారం, కామారెడ్డి, డిచ్‌పల్లి వంటి స్టేషన్లలో రైళ్లు తరచూ నిలిపివేస్తుంటారు. డబ్లింగ్ పూర్తయితే ఈ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుంది. రైళ్లు నిరాటంకంగా నడవడంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా సమయపాలన కూడా మెరుగుపడుతుంది.

Railway Doubling | నిజామాబాద్​ వ్యాపార రంగానికి ఊతం..

రైల్వే డబ్లింగ్ కేవలం ప్రయాణికులకే కాదు, ప్రాంతీయ అభివృద్ధికి కూడా కీలకంగా మారనుంది. నిజామాబాద్ వ్యవసాయ, వాణిజ్య ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా చేరే అవకాశం ఉంటుంది. పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో మరిన్ని రైళ్లు నడిపేందుకు కూడా ఈ ప్రాజెక్ట్​ ఉపయోగపడనుంది. ఇప్పటికే విద్యుదీకరణ పూర్తయిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్ వరకు విద్యుదీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో రైళ్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారింది. ఇప్పుడు డబ్లింగ్ పనులు కూడా పూర్తయితే ఈ మార్గం తెలంగాణ ఉత్తర ప్రాంతానికి అత్యంత కీలక రైల్వే కారిడార్‌గా మారనుంది.

Railway Doubling | ప్రయాణ సమయం తగ్గుతుంది..

చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు గత ఏడాది కార్యరూపం దాల్చడంతో నిజామాబాద్ జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పనులు నిర్ణీత గడువులో పూర్తయితే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా జిల్లాకు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూడా కొత్త దిశ లభించనుంది. మేడ్చల్–ముద్ఖేడ్​ డబ్లింగ్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉత్తర తెలంగాణ రైల్వే రవాణా వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలవనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

railway

ఇది కూడా చదవండి: Inter Supplementary Results | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *