Trump Ukraine War | ఉక్రెయిన్‌లోకి భారత శాంతి దళాలు.. జేడీ వాన్స్ ప్రతిపాదనను తోసిపుచ్చిన ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో తీవ్ర ప్రయత్నాలు చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Trump Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ఒక వినూత్న ప్రతిపాదన, దానికి ట్రంప్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ‘రెజీమ్ ఛేంజ్’ (Regime Change) పేరుతో ప్రముఖ రచయితలు మ్యాగీ హాబర్‌మాన్, జొనాథన్ స్వాన్ రాసిన పుస్తకంలో ఈ కీలక విషయాలు వెలుగుచూశాయి.

Trump Ukraine War | యుద్ధం ఆపేందుకు మంతనాలు..

ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన పది రోజుల్లోనే ఓవల్ ఆఫీసులో జరిగిన కీలక సమావేశంలో ఉక్రెయిన్-రష్యా ప్రత్యేక రాయబారి కీత్ కెలాగ్ ఒక ముసాయిదా ప్రణాళికను ప్రవేశపెట్టారు. యుద్ధ క్షేత్రంలో కాల్పుల విరమణను పర్యవేక్షించేందుకు ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి ఐరోపా దేశాల నుంచి శాంతి పరిరక్షణ దళాలను పంపాలని ఆయన సూచించారు.

Trump Ukraine War | వాన్స్ సూచన , ట్రంప్ కౌంటర్..

అయితే, ఈ ప్రతిపాదనను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. నాటో సభ్య దేశాల బలగాలను ఉక్రెయిన్‌లోకి పంపడం అంటే రష్యాను మరింత రెచ్చగొట్టినట్లేనని, తద్వారా అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగాల్సిన ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని వాన్స్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఐరోపాయేతర దేశాల నుంచి దళాలను పంపాలని సూచిస్తూ, భారత్ , సౌదీ అరేబియా పేర్లను ప్రతిపాదించారు. కానీ, వాన్స్ ప్రతిపాదనను ట్రంప్ సున్నితంగానే తిరస్కరించారు. “భారత ప్రధాని మోదీతో నాకు చాలా బలమైన అనుబంధం ఉంది. ఆయన నన్ను ఎంతగానో అభిమానిస్తారు. కానీ, భారత్ ఎప్పటికీ ఇందుకు అంగీకరించదు. ఇలాంటి అంతర్జాతీయ వివాదాల్లో జోక్యం చేసుకుని అనవసరంగా మూల్యం చెల్లించుకోవాలని భారత్ అనుకోదు” అని ట్రంప్ స్పష్టం చేసినట్లు పుస్తకంలో వివరించారు.

Trump Ukraine War | ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీరుపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీ ఒక అసమర్థ నాయకుడని, అమెరికా నుంచి భారీగా నిధులు అందుతున్నా.. తన సొంత దేశాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు అగ్రరాజ్యం చేసిన ప్రయత్నాలు, అగ్రనేతల మధ్య జరిగిన ఈ రహస్య చర్చలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో సంచలనంగా మారాయి.

ఇది కూడా చదవండి:  Harish Rao Letter | కర్ణాటక అక్రమ ప్రాజెక్ట్​లను అడ్డుకోవాలి.. సీఎంకు హరీశ్​రావు లేఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *