Canada clears India | నిజ్జర్ హత్యలో భారత్​ ప్రమేయం లేదన్న కెనడా

ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత​ అధికారులు సంబంధం లేదని కెనడా ప్రభుత్వం తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Canada clears India | కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యతో భారత అధికారులకు సంబంధం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని కెనడా పోలీసులు (Canadian Police) బుధవారం తెలిపారు.

హర్దీప్​సింగ్​ నిజ్జర్​ ఖలీస్థాన్​ వేర్పాటువాది. 2023లో ఆయనను కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీంతో అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ఘటనపై భారత అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను భారత్​ ఖండించింది. అనంతరం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ట్రూడో తర్వాత 2025లో మార్క్​ కార్నే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ క్రమంలో నిజ్జర్​ హత్యతో భారత్​ (India)కు సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని కెనడా పోలీసులు తెలిపారు.

Canada clears India | కొనసాగుతున్న దర్యాప్తు

నిజ్జర్​ హత్య కేసులో అరెస్టులు, స్వాధీనాల ఆధారంగా దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిజ్జర్ హత్యతో సహా పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, భారతదేశానికి చెందిన మూడు అంతర్జాతీయ వ్యవస్థీకృత నేర సమూహాలతో సంబంధం ఉన్న 24 మందిని అమెరికా, కెనడా, యూరప్‌లో అరెస్ట్​ చేశారు.

Canada clears India | బిష్ణోయ్​ గ్యాంగ్​పై కేసు

నిజ్జర్​ హత్యకు పంజాబ్‌కు చెందిన 33 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధం ఉన్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి పలు దేశాల్లో బిష్ణోయ్​ గ్యాంగ్​ సభ్యులను అధికారులు అరెస్ట్ చేశారు. బిష్ణోయ్ సంస్థ ఉత్తర అమెరికా నాయకుడైన పంజాబ్‌కు చెందిన 32 ఏళ్ల సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్, బిష్ణోయ్ సంస్థ యొక్క యూరోపియన్ నాయకుడైన రాజస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల రోహిత్ గోదారా, పంజాబ్‌కు చెందిన 58 ఏళ్ల సుఖ్‌రాజ్ సింగ్ కాంగ్‌లపై కూడా అభియోగాలు మోపింది. జైలు నుంచి బిష్ణోయ్​ ఆదేశాల మేరకు గోల్డీ బ్రార్​ నిజ్జర్​ హత్య పథకం వేశాడని అమెరికా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. దోపిడీలు, లక్షిత హత్యలు, కాల్పులు, బెదిరింపులు, అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చూపే ఇతర నేరాలకు పాల్పడే భారతీయ నేర ముఠాలపై సంవత్సరాల తరబడి సాగిన ఫెడరల్ దర్యాప్తు ఫలితమే ‘ఆపరేషన్ హార్డ్ బాల్’ అని యూఎస్ న్యాయ శాఖ తెలిపింది.

Canada clears India | 37 మందిపై కేసు

మూడు అభియోగపత్రాల ద్వారా మొత్తం 37 మంది నిందితులపై కేసులు నమోదు అయ్యాయి. వీరిలో భారతదేశంలో జైలులో ఉంటూనే తమ అంతర్జాతీయ నేర ముఠాలను నడిపిన ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో 11 మంది, ఇండియానాలో ఒకరు, జార్జియాలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 10పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఏడుగురు అమెరికాలో, ఇద్దరు భారత్​లో, ఒకరు ఐరోపాలో ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో భారత్​ అధికారులకు నిజ్జర్​ హత్య కేసుతో సంబంధం లేదని కెనడా స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి..: Yuva Setu Scheme | కర్ణాటక ‘యువ సేతు’.. స్థానికులకు ప్రాధాన్యం.. తెలుగు యువత ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *