అక్షరటుడే వెబ్‌డెస్క్: Mumbai Airport Runway Incident | దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఎదురెదురుగా రావడంతో ప్రయాణికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఏటీసీ (ATC) అధికారుల సమయస్ఫూర్తితో ఘోర ప్రమాదం తప్పింది.
Mumbai Airport Runway Incident | టేకాఫ్ కోసం అదే రన్‌వేపైకి ..
మంగళవారం రాత్రి ( జులై 7) 10 గంటల సమయంలో, సిలిగురి నుంచి వచ్చిన ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్’ విమానం ల్యాండింగ్‌కు సిద్ధమై రన్‌వేపైకి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో, ఢిల్లీకి బయలుదేరాల్సిన ‘ఎయిర్ ఇండియా’ విమానం టేకాఫ్ కోసం అదే రన్‌వేపైకి ప్రవేశించింది. రెండు విమానాలు ఒకదానికొకటి అడుగుల దూరంలో ఎదురెదురుగా రావడంతో ఎయిర్‌పోర్టులో ఉత్కంఠ నెలకొంది.
Mumbai Airport Runway Incident | తప్పిన ప్రమాదం..
రన్‌వేపై జరుగుతున్న ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ ఇండియా విమాన పైలట్‌ను హెచ్చరించడంతో, ఆయన విమానాన్ని అక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో సుమారు 100 మీటర్ల దూరంలో పెను ప్రమాదం తప్పింది.
Mumbai Airport Runway Incident | స్పందించిన ఎయిర్ ఇండియా..
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ అధికారికంగా స్పందించింది. “ఏటీసీ ఆదేశాల మేరకు పైలట్ వెంటనే టేకాఫ్ ప్రక్రియను నిలిపివేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు, విమానాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు” అని పేర్కొంది. అయితే, ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఏ పరిస్థితుల్లో వచ్చాయనే దానిపై విమానయాన అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న విమానయాన భద్రతా లోపాలు ప్రయాణికులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: KTR Kaleshwaram Water | నీరు లేక రైతుల ఇబ్బందులు.. వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలు : కేటీఆర్