అక్షరటుడే వెబ్డెస్క్: Brahmins Avoid Garlic | మన దేశంలో కొన్ని వర్గాలకు చెందిన బ్రాహ్మణులు, ముఖ్యంగా సాంప్రదాయ నిష్టను పాటించేవారు అల్లం, వెల్లుల్లిని తమ దైనందిన ఆహారంలో పూర్తిగా మినహాయిస్తుంటారు. వీటికి పవిత్ర గ్రంథాలు , ఆయుర్వేదంలో ( Ayurveda )పేర్కొన్న కొన్ని ప్రత్యేక కారణాలే ప్రధాన కారణమని పండితులు చెబుతున్నారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆహారాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలు. వెల్లుల్లి, అల్లం వంటి పదార్థాలు శరీరంలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని లేదా కొన్నిసార్లు ఆవేశాన్ని (రాజసిక, తామసిక గుణాలు) పెంచుతాయని నమ్ముతారు. ఇవి మనస్సును చంచలంగా మార్చి, ఏకాగ్రతను దెబ్బతీస్తాయని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తున్నాయి. మరోవైపు ఆధ్యాత్మిక సాధన చేసేవారు, పూజలు, ధ్యానం చేసేవారు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి పూర్తిగా సాత్విక ఆహారాన్ని (ఉల్లి, వెల్లుల్లి లేనిది) తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.
Brahmins Avoid Garlic | పౌరాణిక నమ్మకాలు ..
హిందూ పురాణాల ప్రకారం, అమృత మథన సమయంలో రాక్షసుడైన స్వర్భానుడు (రాహువు, కేతువులు) దేవతల రూపంలో వచ్చి అమృతాన్ని సేవించడానికి ప్రయత్నించగా, శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో అతని తలను ఖండిస్తాడు. ఆ సమయంలో అతని గొంతు నుంచి కింద పడిన రక్తపు చుక్కల నుండి వెల్లుల్లి, ఉల్లిపాయలు పుట్టాయని ఒక ప్రసిద్ధ నమ్మకం ఉంది. అసుర మూలాలు ఉండటం వల్ల వీటిని కొందరు తామసిక పదార్థాలుగా భావించి దూరంగా పెడతారు.
Brahmins Avoid Garlic | ఆధ్యాత్మిక చింతన..
మతపరమైన నిష్టను పాటించే బ్రాహ్మణులు లేదా రుషులు తమ ఇంద్రియాలను అణచిపెట్టడానికి, కోరికలను నియంత్రించుకోవడానికి సాత్విక భోజనాన్నే భగవత్ర్పసాదంగా స్వీకరిస్తారు. వెల్లుల్లి, ఉల్లి వంటి దుర్వాసన వెదజల్లే , శరీర ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచే పదార్థాలు పూజా కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక చింతనకు అంతగా అనుకూలం కాదనేది సాంప్రదాయ వాదుల నమ్మకం.
అయితే, కాలక్రమేణా మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది బ్రాహ్మణులు రుచి, ఆరోగ్యం , పోషకాహార నిపుణుల సూచనల ఆధారంగా వీటిని తమ ఇళ్లలో వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ, కఠినమైన సాంప్రదాయాలు, పూజా పునస్కారాలు , వ్రతాలు ఆచరించే సమయంలో మాత్రం ఇప్పటికీ చాలా నిష్టగా వీటిని పూర్తిగా నిషేధిస్తారు.
ఇది కూడా చదవండి:ACB Case | అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కేసు