అక్షరటుడే వెబ్‌డెస్క్: Nepal Flash Floods | నేపాల్‌లోని రసువా జిల్లాలో బుధవారం ఉదయం సంభవించిన భీకర వరదలు ఆ ప్రాంతాన్ని తీవ్రంగా ముంచెత్తాయి. భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో నదీ తీర ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉన్న గ్రామాలు క్షణాల్లో జలమయమయ్యాయి. నీటి ప్రవాహం ఎంత తీవ్రంగా ఉందంటే, ఒడ్డున ఉన్న జనావాసాలు పూర్తిగా కొట్టుకుపోయి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఈ దృశ్యాలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతున్నాయి. స్థానికులు వరద ఉద్ధృతికి ఏ విధంగా కొట్టుకుపోయారోనని తలచుకుంటేనే గుండెలు పిండేస్తున్నాయి.
Nepal Flash Floods | వేయి మందికి పైగా గల్లంతు..
ఈ పెను విపత్తు కారణంగా రసువా జిల్లాలోని అనేక కీలక ప్రాంతాలు, మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉత్తరగయ గ్రామీణ మునిసిపాలిటీ ఉపాధ్యక్షురాలు చమేలీ గురుంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్యాఫ్రూబెసి, బెట్రావతి, మైలుంగ్, సల్లెతార్, శాంతిబజార్, పైరేబెసి, ఖాల్తీ బస్తీ, సోలే, త్రిశూలి, బట్టార్ వంటి దాదాపు డజనుకు పైగా గ్రామాలు ఈ హఠాత్ వరద దాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ప్రస్తుతానికి మరణాలు, గాయపడినవారు, ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక పూర్తి గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయనప్పటికీ, స్థానిక అధికారులు, ప్రజలు, భద్రతా సంస్థల సమాచారం ప్రకారం నష్టం ఊహకందని స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీయగా, వెయ్యి మందికి పైగా వరద నీటిలో కొట్టుకుపోయి ఉంటారని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నేపాల్ ఆర్మీ చీఫ్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల సుమారు 4,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Nepal Flash Floods | ముమ్మరంగా సహాయక చర్యలు..
బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు వేగంగా రంగంలోకి దిగాయి. పరిస్థితి అత్యంత గంభీరంగా మారడంతో నేపాల్ రెడ్ క్రాస్ తన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను వెంటనే అప్రమత్తం చేసింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ (IFRC) కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. మరోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని హెచ్చరించారు.
సహాయక చర్యల కోసం నేపాల్ ప్రభుత్వం వెంటనే రెండు సైనిక హెలికాప్టర్లను రంగంలోకి దించింది. నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసులను సహాయక చర్యల్లో భాగస్వాములను చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను రసువా జిల్లాకు రప్పిస్తున్నారు. వరద తీవ్రతపై హోం మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశం నిర్వహించగా, ప్రధానమంత్రి బాలేంద్ర షా కూడా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా దేశంలోని 5 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
These visuals from the floods in Rasuwa, Nepal are absolutely horrific. The scale of the destruction looks unreal, almost like a scene from a disaster movie.The entire Himalayan belt needs to seriously work on better early warning systems for such flash floods. Prayers for… pic.twitter.com/7iiupXXIzT
— Nikhil saini (@iNikhilsaini) August 26, 2026
ఇది కూడా చదవండి: Minority Welfare Telangana | మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : పీసీసీ చీఫ్