అక్షరటుడే వెబ్‌డెస్క్: Kyiv Drone Attack | ఉక్రెయిన్ ( Ukraine )రాజధాని కీవ్ నగర సమీపంలో రష్యా జరిపిన భీకర డ్రోన్ దాడిలో భారీ ప్రాణనష్టం సంభవించింది. రష్యా ప్రయోగించిన డ్రోన్ కీవ్ శివారులోని ఓ భారీ గోదామును ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ గోదాములో పేలుడు పదార్థాలు నిల్వ ఉండటంతో ప్రమాద తీవ్రత విపరీతంగా పెరిగింది. అర్ధరాత్రి జరిగిన ఈ దాడితో ఆ ప్రాంతం మొత్తం అగ్నిగుండంగా మారింది. ఆకాశాన్ని తాకేలా మంటలు చెలరేగగా, ఆ ప్రాంతం ప్రస్తుతం తీవ్ర విధ్వంసంతో కనిపిస్తోంది. ఈ ఘోర దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Kyiv Drone Attack | అధికారుల స్పందన ..
కీవ్ సైనిక పరిపాలనా విభాగం అధిపతి తైమూర్ తకచెంకో స్పందిస్తూ.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ మారణహోమంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. డ్రోన్ దాడికి, గోదాములో పేలుడు సంభవించడానికి గల కారణాలపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. జనావాసాలకు దగ్గరలో పేలుడు పదార్థాలు నిల్వ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల మధ్య ప్రమాదకర మందుగుండు సామాగ్రి ఉంచడం తగదని పేర్కొన్నారు.
Kyiv Drone Attack | రష్యా రక్షణ శాఖ వాదన..
మరోవైపు, ఈ దాడులపై రష్యా రక్షణ శాఖ భిన్నంగా స్పందించింది. తాము కేవలం సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది. ఉక్రెయిన్ సైన్యం డ్రోన్ల తయారీ కోసం ఉపయోగిస్తున్న పరికరాలను నిల్వ చేసిన ఆయుధాగారంపైనే తమ బలగాలు దాడి చేశాయని సమర్థించుకుంది. ఉక్రెయిన్ చెబుతున్నట్లుగా అది సాధారణ గోదాము కాదని, సైనిక కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రమని రష్యా వాదించింది.
ఇది కూడా చదవండి: Telangana SIR Process | ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ