అక్షరటుడే వెబ్‌డెస్క్: E25 Ethanol Petrol | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలో విజయవంతంగా అమలు చేస్తున్న ‘E20’ (20 శాతం ఇథనాల్) పెట్రోల్ తర్వాత, ఇప్పుడు దానికి కొనసాగింపుగా E21 నుండి E25 వరకు ఇథనాల్ మిశ్రమంతో కూడిన పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
E25 Ethanol Petrol | 2029 నాటికి 25 శాతం ఇథనాల్ లక్ష్యం..
ప్రస్తుతం ఉన్న ఇంధన విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలను రూపొందించింది. తాజా అంచనాల ప్రకారం, 2027 నాటికి 21 శాతం ఇథనాల్ కలిపిన ‘E21’ పెట్రోల్‌ను, 2029 నాటికి 25 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన ‘E25’ పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ద్వారా విదేశాల నుండి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
E25 Ethanol Petrol | ఐదేళ్ల ముందే సక్సెస్..
వాస్తవానికి దేశంలో 2030 నాటికి E20 ఇంధనాన్ని పూర్తిగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రభుత్వం దానిని ఐదేళ్ల ముందే అధిగమించడం విశేషం. ఈ విధానం వల్ల ఏటా సుమారు 45 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా, దాదాపు రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
E25 Ethanol Petrol | సామాన్యులపై భారం పడకుండా..
ప్రస్తుతం వాడుకలో ఉన్న E20 పెట్రోల్‌పై ( E20 Petrol ) పాత వాహనదారులు మైలేజ్ సమస్యలు, విడిభాగాల అరుగుదల వంటి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులపై ఆకస్మికంగా భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త ఇంధన విధానానికి అనుగుణంగా ఇంజిన్లు, ఇంధన సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడానికి బజాజ్, టయోటా, టీవీఎస్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు తగిన సమయాన్ని ఇస్తూ, ఈ ప్రక్రియను దశలవారీగా అమలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి