అక్షరటుడే వెబ్‌డెస్క్: Makthal Development Project | నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మక్తల్ ప్రాంతంలో పర్యటించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇందులో రెండు అధికారిక పర్యటనలు కాగా, నేటితో కలిపి మరో రెండు అనధికారిక పర్యటనలు ఉన్నాయి. పదేపదే ఇక్కడికి రావడం ద్వారా ఈ ప్రాంత పరిస్థితులపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఏర్పడింది.

Makthal Development Project | గత పాలకుల నిర్లక్ష్యం ..
కృష్ణా, భీమా వంటి రెండు జీవనదులు ప్రవహిస్తున్నా, సారవంతమైన నేలలు, కష్టపడే జనం ఉన్నా మక్తల్ ప్రాంతం అభివృద్ధికి దూరమవ్వడానికి గత ప్రభుత్వాల అలసత్వమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. ఈ నదుల నీటిని ఇక్కడి తాగు, సాగు అవసరాలకు వాడుకుంటే ప్రజల బతుకులు మారుతాయని ఆయన విశ్వసించారు. అందుకే ‘నారాయణపేట–మక్తల్–కొడంగల్’ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మరోవైపు, సంగంబండ ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు నీరివ్వాల్సి ఉన్నా, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కాల్వల నిర్మాణం పూర్తికాక భీమా ప్రాజెక్టు ఫలాలు కేవలం 70 వేల ఎకరాలకే పరిమితమయ్యాయి.

Makthal Development Project | కర్ణాటకతో ఒప్పందం..
కృష్ణా, భీమా నదులపై కొత్తగా బ్యారేజీలు నిర్మిస్తే వరద నీటిని అరికట్టడంతో పాటు అదనంగా మరో 50 వేల ఎకరాలకు నీరందించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నదులు కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహిస్తున్నందున, బ్యారేజీల నిర్మాణం కోసం ఇరు రాష్ట్రాల పాలకులు, అధికారులు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం తన మంత్రిమండలి సహచరులు, ఉన్నతాధికారులతో కలిసి ఏరియల్ సర్వే (వైమానిక సర్వే) నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులు గనుక అనుకున్నట్లుగా పూర్తయితే మక్తల్ ప్రాంతం పచ్చని పంటలతో కళకళలాడుతుందని, ఈ ప్రాంత ప్రజల వలసలకు శాశ్వతంగా బ్రేక్ పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hindu Atmiya Sammelan | పోతంగల్లో విరాట్ హిందూ ఆత్మీయ సమ్మేళనం
