World Alzheimer’s Month | డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ ప్రత్యేక దృష్టి.. ‘వజూద్ రహే మౌజూద్’ ప్రచారం ప్రారంభం!

ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియా (చిత్తవైకల్యం)పై టాటా ట్రస్ట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రత్యేక దృష్టి సారించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: World Alzheimer’s Month | ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియా (చిత్తవైకల్యం)పై టాటా ట్రస్ట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రత్యేక దృష్టి సారించింది. ఇది కేవలం బాధితుల కుటుంబాలకే కాకుండా, దేశంలోని మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపే ముఖ్యమైన ఆరోగ్య సవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముందస్తు జోక్యాలు చేపట్టాలని పిలుపునిస్తూ ‘వజూద్ రహే మౌజూద్’ అనే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.

World Alzheimer’s Month | డిమెన్షియా ముప్పు..

భారతదేశంలో ( India )వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి దేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు 347 మిలియన్లకు పైగా ఉంటారని అంచనా. ఈ జనాభా అమెరికా మొత్తం జనాభాకు దాదాపు సమానం. ఈ మార్పు దేశ ఆరోగ్య వ్యవస్థలు, కుటుంబాలపై తీవ్ర భారాన్ని మోపనుంది.

అల్జీమర్స్ & డిమెన్షియా జర్నల్ నివేదిక ప్రకారం, నేడు భారతదేశంలో 8.8 మిలియన్ల వృద్ధులు డిమెన్షియాతో జీవిస్తున్నారు. అయితే ఇందులో దాదాపు 90 శాతం కేసులు నిర్ధారణ కాకుండానే ఉండిపోతున్నాయి. 2023 ఎయిమ్స్-యూఎస్‌సీ అధ్యయనం ప్రకారం.. ఈ సంఖ్య 2036 నాటికి 16.9 మిలియన్లకు చేరుకుని, ఊహించిన దానికంటే ముందే రెట్టింపు కానుంది. అందుకే భారతదేశం కేవలం ముందస్తు గుర్తింపునకే పరిమితం కాకుండా, బలమైన సహకార వ్యవస్థను నిర్మించాలని ఈ క్యాంపెయిన్ నొక్కి చెబుతోంది.

World Alzheimer’s Month | జ్ఞాపకశక్తి లోపం కాదు..

మనోవైద్యులు, నరాల వైద్యులు, వృద్ధాప్య వైద్య నిపుణులు , రోగుల ప్రత్యక్ష అనుభవాల ఆధారంగా రూపొందించిన ఈ ప్రచారం.. డిమెన్షియా అనేది కేవలం జ్ఞాపకశక్తిని కోల్పోయే వ్యాధి మాత్రమే కాదని, రోగులు క్రమంగా తమ స్వీయ స్పృహను కోల్పోయే తీవ్రమైన సమస్య అని స్పష్టం చేస్తోంది. దీని తొలి లక్షణాలను కేవలం వృద్ధాప్యంగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తోంది.

World Alzheimer’s Month | ప్రముఖుల అభిప్రాయాలు..

రాబోయే మూడు దశాబ్దాలలో భారతదేశ ఆరోగ్య చర్చలలో డిమెన్షియా ప్రధానాంశంగా మారుతుందని, వ్యాధితో పాటు రోగి, సంరక్షకుల వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వారి చుట్టూ సంరక్షణ వ్యవస్థను నిర్మించడమే తమ ప్రయత్నమని టాటా ట్రస్ట్స్ సీఈఓ సిద్ధార్థ్ శర్మ తెలిపారు. జ్ఞాపకశక్తి లేదా ప్రవర్తనలో మార్పులను కేవలం వృద్ధాప్యంగా భావించకూడదని, డిమెన్షియాకు పూర్తిగా నివారణ లేనప్పటికీ మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి కారకాలను సరిదిద్దడం ద్వారా ముందస్తుగా గుర్తించి మేలు చేయవచ్చని టాటా ట్రస్ట్స్ సీనియర్ సలహాదారు డాక్టర్ అనురా కుర్పాడ్ పేర్కొన్నారు. భారతదేశంలో నేడు 50 కన్నా తక్కువ పూర్తిస్థాయి డిమెన్షియా సంరక్షణ కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, కుటుంబాలకు తగిన వనరులు, జ్ఞానాన్ని అందించే బలమైన వ్యవస్థ మనకు ఎంతో అవసరమని డిమెన్షియా ఇండియా అలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణి సుందరం నొక్కిచెప్పారు.

World Alzheimer’s Month | భవిష్యత్ ప్రణాళికలు..

తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘ఎల్డర్ స్ప్రింగ్’ హెప్‌లైన్ స్పూర్తితోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ‘ఎల్డర్ లైన్’ (14567)ను అభివృద్ధి చేసింది. ఈ అనుభవంతో ట్రస్ట్స్ ఇప్పుడు డిమెన్షియాతో సహా నిర్లక్ష్యం చేయబడుతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్’ , ‘డిమెన్షియా ఇండియా అలయన్స్’లకు మద్దతు ఇస్తూ అవగాహన, పరిశోధనలను ప్రోత్సహిస్తోంది.

ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు , సమాజాలు అప్రమత్తమై, ముందస్తు పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలని టాటా ట్రస్ట్స్ కోరుతోంది. తద్వారా బాధితులు వీలైనంత కాలం తమ గౌరవాన్ని, నాణ్యమైన జీవితాన్ని నిలబెట్టుకునేలా చూడాలని పిలుపునిచ్చింది.

ఇది కూడా చదవండి: Jagga Reddy Comments | కేసీఆర్ చేసినదాని కంటే పెద్ద మోసం ఉంటుందా? : జగ్గారెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *