Vijay TVK | విజయ్ సీఎం కావడంలో జాప్యం.. టీవీకే కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vijay TVK | తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంలో ఎదురవుతున్న అడ్డంకులతో కలత చెందిన ఇసక్కియప్పన్ (40) అనే కార్యకర్త శనివారం తిరునెల్వేలిలో ఒంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన అతడిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Vijay TVK | రాజకీయ విజయాన్ని కాంక్షిస్తూ..

ఇసక్కియప్పన్ గతంలో కూడా విజయ్ పట్ల తనకున్న వీరాభిమానాన్ని చాటుకున్నాడు. సుమారు నాలుగు నెలల క్రితం విజయ్ రాజకీయ విజయాన్ని కాంక్షిస్తూ 16 అడుగుల పొడవైన ఈటెతో తన రెండు చెంపలను పొడుచుకుని వార్తల్లో నిలిచాడు. తాజాగా పార్టీ మెజారిటీకి చేరువలో ఉన్నా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Vijay TVK | తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ..

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 (మెజారిటీ మార్క్) స్థానాలకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు వామపక్ష పార్టీలు (CPI, CPI-M) విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. ఐయూఎంఎల్ (IUML) మద్దతు ఇచ్చేందుకు నిరాకరించగా, వీసీకే (VCK) పార్టీ తన నిర్ణయాన్ని వాయిదా వేయడం రాజకీయ ప్రతిష్టంభనకు కారణమైంది.

Vijay TVK | గవర్నర్ తీరుపై చర్చ..

ప్రభుత్వ ఏర్పాటుకు తనకున్న బలాన్ని నిరూపించుకునేందుకు విజయ్ గత మూడు రోజుల్లో మూడుసార్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ ఉందని భావిస్తున్నప్పటికీ, గవర్నర్ మాత్రం మెజారిటీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని విజయ్‌ను వెనక్కి పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పార్టీ శ్రేణుల్లో ఆందోళన పెరిగి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: Revanth Reddy Govt|కాంగ్రెస్ ప్రభుత్వ ఆయుష్షు సగం అయిపోయింది: జీవన్ రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *