Jharkhand Police Rape Case | పీఎస్‌కు వెళ్లిన మహిళపై పోలీసుల అత్యాచారం.. 15 మందిపై సస్పెన్షన్ వేటు!

రక్షక భటులే భక్షకులుగా మారిన అమానుష ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jharkhand Police Rape Case | రక్షక భటులే భక్షకులుగా మారిన అమానుష ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కష్టమొచ్చి రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఒక మహిళపై అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు కామాంధులై అత్యాచారానికి పాల్పడ్డారు. రక్షించాల్సిన చోటే ఈ ఘోరం జరగడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి గమ్హరియా పోలీస్ స్టేషన్‌లోని మొత్తం 15 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే బాధ్యులైన ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

Jharkhand Police Rape Case | అసలు ఏం జరిగింది?

జార్ఖండ్‌లోని సెరాయికేలా-ఖర్సవాన్ జిల్లా గమ్హరియా ( Gamharia )పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. అక్టోబర్ 29న కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు తన భర్తతో గొడవపడి అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళితే భర్త తనపై దాడి చేస్తాడనే భయంతో ఆమె పొరుగువారి ఇంటికి వెళ్లి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. వారు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో పీసీఆర్ వ్యాన్ వచ్చి ఆమెను గమ్హరియా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ఆమెకు విశ్రాంతి కోసం ఒక గదిని కేటాయించగా, అదే గదిలోకి ప్రవేశించిన వైర్‌లెస్ ఆపరేటర్ నీరజ్ లక్రా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అక్టోబర్ 31న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

Jharkhand Police Rape Case | 15 మంది పోలీసులపై సస్పెన్షన్ ..

ఈ సంఘటనపై జిల్లా పోలీసులు , ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం , బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు గాను భారీ ఎత్తున చర్యలు తీసుకున్నారు. మొదట గమ్హరియా పీఎస్ ఇన్‌ఛార్జ్ సంజయ్ ప్రసాద్‌తో పాటు నలుగురిని సస్పెండ్ చేయగా, ఆ తర్వాత ఎస్పీ ఆదేశాల మేరకు మరో తొమ్మిది మందిని విధుల నుంచి తొలగించారు. దీంతో మొత్తం సస్పెండ్ అయిన వారి సంఖ్య 15కి చేరింది. వీరిలో ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు హవల్దార్లు , కానిస్టేబుళ్లు ఉన్నారు.

Jharkhand Police Rape Case | ముగ్గురు పోలీసుల అరెస్ట్..

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఎస్‌డీపీఓ అనుభవ్ భరద్వాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన వైర్‌లెస్ ఆపరేటర్ నీరజ్ లక్రాను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దర్యాప్తును ముమ్మరం చేసిన ఎస్ఐటీ, బాధితురాలిని కాపాడటంలో నిర్లక్ష్యం వహించిన సబ్‌ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ సాహు, కానిస్టేబుల్ సంతోష్ కుమార్ రాయ్‌లను కూడా అరెస్ట్ చేసింది. ఈ అమానుషంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Green Crackers | దీపావళి బాణసంచాపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *