అక్షరటుడే వెబ్‌డెస్క్: ED Drug Raids | కేంద్ర ప్రభుత్వ ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయి ఆపరేషన్ చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా , వాటితో ముడిపడిన మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లను కూకటివేళ్లతో పెకిలించే లక్ష్యంతో గురువారం ఏకకాలంలో ఏకంగా 30 కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలో దర్యాప్తు జరుగుతున్న 8 వేర్వేరు నార్కోటిక్స్ కేసులకు సంబంధించి ఈ ముమ్మర సోదాలు కొనసాగుతున్నట్లు ఈడీ ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం.
ED Drug Raids | విస్తృత తనిఖీలు..
ఈ భారీ దాడుల్లో భాగంగా తెలంగాణ ( Telangana ), కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని డ్రగ్స్ సిండికేట్‌కు సంబంధించిన నిందితులు, వివిధ వ్యాపార సంస్థలు, బినామీల నివాసాలు , కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. మాదకద్రవ్యాల అమ్మకాల ద్వారా ఆర్జించిన అక్రమ ఆదాయాన్ని హవాలా మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్లించడం, ఆపై దానిని రియల్ ఎస్టేట్ , ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా మార్చిన వ్యవహారాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
ED Drug Raids| కీలక ఆధారాల గుర్తింపు..
ఈ సోదాల సమయంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన భారీ ఎత్తున కీలక దస్తావేజులు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, బ్యాంకు ఖాతాలు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. డ్రగ్ మాఫియా వెనుక తెరవెనుక నడిపిస్తున్న కీలక సూత్రధారుల ఆర్థిక సామ్రాజ్యాన్ని కట్టడి చేసేందుకు ఈడీ చేపట్టిన ఈ భారీ కార్యాచరణ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సోదాలు ముగిసిన తర్వాత మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ED Money Laundering | డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ పంజా.. రూ.150 కోట్ల అక్రమాస్తులపై మనీలాండరింగ్ కేసు నమోదు!