అక్షరటుడే వెబ్‌డెస్క్: Hotel Shadab | హైదరాబాద్ ( Hyderabad )పాతబస్తీలోని మదీనా సర్కిల్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ బిర్యానీ కేంద్రం ‘హోటల్ షాదాబ్’ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌ను తెలంగాణ ఆహార భద్రతా విభాగం (TG SAFE) అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. నగరవ్యాప్తంగా ఆహార నాణ్యతా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారుల బృందం, ఈ చర్యలు తీసుకోవడానికి దారితీసిన ప్రధానంశాలు ఇలా ఉన్నాయి.
Hotel Shadab | ఆకస్మిక తనిఖీలు ..
నగరవ్యాప్తంగా ఆహార నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల ప్రత్యేక బృందం, పోలీసులతో కలిసి షాదాబ్ హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో వంటగది పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. మాంసం , ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం కనిపెట్టగా, ముఖ్యంగా కిచెన్‌లో కాలం చెల్లిన ఆహార నిల్వలు ఉండటాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు.
Hotel Shadab | నిబంధనల ఉల్లంఘన ..
ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను హోటల్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. తక్షణమే హోటల్ వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని యాజమాన్యాన్ని కఠినంగా ఆదేశించారు. దశాబ్దాల చరిత్ర కలిగి, బిర్యానీ ప్రియుల ప్రత్యేక ఆదరణ పొందిన షాదాబ్ హోటల్‌పై ఇలాంటి చర్యలు తీసుకోవడం నగరవాసులను తీవ్ర విస్మయానికి గురిచేసింది.
Hotel Shadab | హోటళ్లపై హెచ్చరికలు..
ప్రజల ప్రాణాలతో, ఆరోగ్యంతో చెలగాటమాడే ఏ సంస్థపైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల కొనసాగింపుగా నిబంధనలు పాటించని ఇతర హోటళ్లకు కూడా నోటీసులు జారీ చేశామని, రాబోయే రోజుల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా విభాగం హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: ED Money Laundering | డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ పంజా.. రూ.150 కోట్ల అక్రమాస్తులపై మనీలాండరింగ్ కేసు నమోదు!