అక్షరటుడే, వెబ్‌డెస్క్: Devagiri Express Hawala | భాగ్యనగరంలో మరోసారి పెద్ద మొత్తంలో హవాలా నగదు పట్టుబడటం కలకలం రేపింది. ముంబయి నుంచి సికింద్రాబాద్‌కు రైలు మార్గంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 1.22 కోట్ల (రూ. 1,22,70,000) హవాలా డబ్బును రైల్వే పోలీసులు పట్టుకున్నారు.
Devagiri Express Hawala | బొల్లారం – మల్కాజిగిరి మధ్య..
మంగళవారం మధ్యాహ్నం ముంబయి నుంచి వచ్చిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు బొల్లారం – మల్కాజిగిరి మధ్య ప్రయాణిస్తున్న సమయంలో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన విజయ్ అంబాదాస్ గుప్తా అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.
రైలు దిగి పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని గమనించిన రైల్వే పోలీసులు, తనిఖీలు చేపట్టారు. అతడి వద్ద ఉన్న బ్యాగును తెరిచి చూడగా భారీ ఎత్తున కరెన్సీ కట్టలు బయటపడ్డాయి.
ఈ నగదుకు సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు లేదా రశీదులు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Devagiri Express Hawala | కేవలం రూ. 5 వేల కమిషన్ కోసం…
పోలీసుల లోతైన విచారణలో నిందితుడు విజయ్ అంబాదాస్ గుప్తా దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించాడు. ముంబయికి చెందిన ఒక ప్రముఖ జ్యువెలరీ వ్యాపారి ఆదేశాల మేరకు ఈ నగదును సికింద్రాబాద్‌కు తీసుకువచ్చినట్లు అంగీకరించాడు.
ఈ మొత్తాన్ని సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో జ్యువెలరీ షాప్ నడుపుతున్న ‘బంటి’ అనే వ్యక్తికి చేరవేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాడు.
ఇంత భారీ మొత్తాన్ని ముంబయి నుంచి సికింద్రాబాద్‌కు చేరవేసినందుకు గాను నిందితుడికి కేవలం రూ. 5 వేల కమీషన్ ఇచ్చేందుకు సదరు వ్యాపారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది.
ఈ హవాలా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ప్రధాన సూత్రధారులైన ముంబయి వ్యాపారి, సికింద్రాబాద్‌కు చెందిన బంటిపై పోలీసులు నిఘా పెట్టారు.
అక్రమ నగదు రవాణాను విజయవంతంగా అడ్డుకున్న పోలీసు సిబ్బందిని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన అధికారులు, దీని వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Swathi Reddy | పెళ్ళి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్…..


