అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tummidihetti Barrage | తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టి నీటిని ఎత్తి పోస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి మహారాష్ట్ర సీఎంను కోరారు. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాల్సి ఉంది. మొదటి ప్రతిపాదనలో ఈ బ్యారేజ్ 152 మీటర్ల ఎత్తు నిర్మించాలనుకున్నారు.
Tummidihetti Barrage | ఎత్తు తగ్గింపు
2016 ఆగస్టు 23న జరిగిన ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం (Government of Maharashtra) అంగీకరించింది. అవసరమైన అనుమతులకు సహకారం అందిస్తామని కూడా అప్పట్లో తెలిపింది. అయితే 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని ముఖ్యమంత్రి తన లేఖలో ప్రస్తావించారు.
148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను పరిశీలించినా, మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని వివరించారు. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుందని లేఖలో ప్రస్తావించారు.

దీనిని కూడా చదవండి : Inter Students Breakfast | ఇంటర్ విద్యార్థులకు టిఫిన్‌లో దోశ, పూరీ, ఇడ్లీ


