Vemula Prashanth Reddy | రేవంత్ రెడ్డి ఒక ‘ఫెయిల్యూర్ సీఎం’..: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్/ఆర్మూర్​: Vemula Prashanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి (CM revanth reddy) ఒక ‘ఫెయిల్యూర్ సీఎం’గా మిగిలిపోయారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్మూర్(Armoor) పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ అవగాహన సదస్సు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

Vemula Prashanth Reddy | ఆర్మూర్​లో పటిష్టంగా బీఆర్​ఎస్​..

​వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గంలో(Armoor Constituency) బీఆర్ఎస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉందనడానికి ఈ సమావేశానికి తరలివచ్చిన జనసందోహమే నిదర్శనమన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాడే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కొనియాడారు. తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్లినా ‘మళ్లీ కేసీఆర్ పాలనే రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, వందల రోజులు దాటినా ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.

Vemula Prashanth Reddy | ​రైతుల సొమ్ము రూ. 2 వేల కోట్ల దోపిడీ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తరుగు పేరుతో క్వింటాలుకు 12 కిలోల చొప్పున కోత విధిస్తూ రైతుల కష్టార్జితాన్ని దారుణంగా దోచుకుంటోందని ప్రశాంత్​రెడ్డి ఆరోపించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రూ. 200 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల రైతుల సొమ్మును మిల్లర్లు, కాంగ్రెస్ నేతలు పంచుకుంటున్నారని మండిపడ్డారు. కల్లాల్లో వడ్లు కుప్పలుగా పేరుకుపోయినా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని, బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేయడం వల్లే ప్రభుత్వం కొనుగోళ్లు జరపాల్సి వచ్చిందన్నారు.

Vemula Prashanth Reddy | ​కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగా

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్(Crude Oil) ధరలు తగ్గుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరను తగ్గించడం లేదని, గతంలో కేసీఆర్(KCR) ప్రభుత్వంపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తన చేతిలో అధికారమున్నా వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. వెంటనే వ్యాట్ తగ్గించి ప్రజలకు రూ. 65లకే పెట్రోల్ అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తోడు దొంగలని విమర్శించారు.

Vemula Prashanth Reddy | ​ఓటర్ల జాబితాపై అప్రమత్తత అవసరం

ప్రభుత్వం చేపట్టే ఇంటింటి సర్వే సమయంలో బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు, గ్రామ ముఖ్య నాయకులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. అధికార పార్టీ కుట్రపూరితంగా బీఆర్ఎస్ సానుభూతి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, చనిపోయిన వారి ఓట్ల తొలగింపును పరిశీలిస్తూనే, కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియా వేదికగా చురుగ్గా ఉంటూ కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్-బీజేపీల అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు.

brs2

ఇది కూడా చదవండి: Hawala Cash Seized | రైలులో రూ.1.22 కోట్ల హవాల నగదు స్వాధీనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *