UP Women Loan Scheme | గుడ్‌న్యూస్.. కోటి మంది మహిళలకు లక్ష రూపాయల వడ్డీ లేని లోన్..!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళల కోసం ఓ అద్భుతమైన ఆర్థిక పథకాన్ని ప్రతిపాదించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: UP Women Loan Scheme | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యోగి ఆదిత్యనాథ్  ( Yogi Adityanath )ప్రభుత్వం మహిళల కోసం ఓ అద్భుతమైన ఆర్థిక పథకాన్ని ప్రతిపాదించింది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించేలా కసరత్తు చేస్తోంది. ‘ఉత్తరప్రదేశ్ మహిళా ఉద్యమి క్రెడిట్ యోజన’ పేరుతో తీసుకొస్తున్న ఈ పథకం ద్వారా మహిళలు సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించడంతో పాటు, ఇప్పటికే ఉన్న వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందనుంది.

UP Women Loan Scheme | మూడు విడతలుగా..

ఈ ప్రతిపాదిత పథకం కింద అర్హులైన మహిళలకు మొత్తం రూ.1 లక్ష మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా అందించనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ.20,000, రెండో విడతలో రూ.30,000, మూడో విడతలో రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. మొదటి విడత కింద అందిన రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన మహిళలు రెండో విడతకు అర్హులవుతారు. ఆ మొత్తాన్ని కూడా సక్రమంగా చెల్లిస్తే మూడో విడతగా రూ.50,000 అందజేస్తారు. అంతేకాకుండా అర్హులైన మహిళలకు ప్రత్యేక క్రెడిట్ కార్డు అందించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దీన్ని చిన్న వ్యాపారం ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

UP Women Loan Scheme | సూక్ష్మ వ్యాపారాలకు ప్రోత్సాహం..

మహిళలు కేవలం స్వయం సహాయక సంఘాల పరిధికి మాత్రమే పరిమితం కాకుండా, సొంతంగా సూక్ష్మ వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని స్థిరమైన ఆదాయ మార్గాలను సృష్టించుకోవడమే ఈ పథకం అసలు ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ‘ఉత్తరప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’ (UPSRLM)తో అనుసంధానించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటన చేసినట్లు సమాచారం కాగా, దీనిపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రాథమిక విధివిధానాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

UP Women Loan Scheme | డిజిటల్ గుర్తింపు కార్డులు..

ఈ ప్రతిపాదిత రుణ సదుపాయానికి తగిన విధివిధానాలను రూపొందించాలని బ్యాంకులను కోరగా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక ప్రతిపాదనను సిద్ధం చేసే పనిలో ఉంది. మరోవైపు స్వయం సహాయక సంఘాల మహిళల డిజిటల్ సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఐడెంటిటీ కార్డులను అందించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. వీటిని డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈ-కామర్స్ మరియు ఆర్థిక సేవలతో అనుసంధానించనున్నారు.

UP Women Loan Scheme | 100 మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటు..

మహిళలకు ఆర్థికంగా పూర్తి స్వావలంబన కల్పించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా 100 ‘మహిళా శక్తి కేంద్రాలు’ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మహిళలు కేవలం సాంప్రదాయ పనులకే పరిమితం కాకుండా చిన్న, స్థిరమైన బిజినెస్‌లను నిర్మించుకోవడానికి ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గతంలో రూ.50,000 ఆర్థిక సాయం ఉంటుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఏకంగా కోటి మంది మహిళలకు మూడు విడతల్లో రూ.1 లక్ష వరకు వడ్డీ లేని క్రెడిట్ సదుపాయం కల్పించే ప్రతిపాదన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదిత దశలోనే ఉన్నందున, తుది మార్గదర్శకాలు, అర్హతలు, అమలు తేదీలపై ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:  Indian Stock Market | అస్థిరంగా మార్కెట్లు.. ఫ్లాట్‌గా సూచీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *