అక్షరటుడే వెబ్‌డెస్క్: BRICS Summit | న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ (BRICS) సమ్మిట్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, సరిహద్దు చెల్లింపులు, యుద్ధాలు, ఉగ్రవాదం వంటి ఎన్నో కీలక అంశాలపై సభ్య దేశాల అధినేతలు చర్చిస్తున్నారు. ఇదే సమయంలో 2027లో జరగబోయే 19వ బ్రిక్స్ సమ్మిట్‌కు చైనా ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ( Xi Jinping )అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు అన్నీ ఆమోదం తెలిపాయి.
BRICS Summit | నేతల ఫొటోషూట్..
సమ్మిట్‌లో భాగంగా సెప్టెంబర్ 12న భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిక్స్ లోని 11 సభ్య దేశాల అధినేతలకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామేశ్వరం ఆలయ బ్యాక్‌డ్రాప్ ముందు ప్రపంచ దేశాల నేతలతో ప్రత్యేకంగా ఫొటోషూట్ నిర్వహించారు. రామేశ్వరం ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇతర దేశాల అధినేతలకు వివరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ భారత్ మండపం ప్రాంగణంలో అందరూ కలిసి మొక్కలు నాటారు.
సదస్సు తొలి రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు బ్రిక్స్ భవిష్యత్తు దిశపై ఈ భేటీలో చర్చించారు. మిడిల్ ఈస్ట్‌లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు భారత్, చైనాతో సహా బ్రిక్స్ సభ్య దేశాలన్నీ కలిసి పనిచేస్తాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ లక్ష్య సాధన కోసం భారత్, చైనా పరస్పర సహకారంతో ముందుకు వెళ్లవచ్చని, ఇరు దేశాలు తమ బలాలను పంచుకుంటూ లోపాలను సరిదిద్దుకోవాలని అభిప్రాయపడ్డారు.
BRICS Summit | న్యూఢిల్లీ డిక్లరేషన్ విడుదల..
సమ్మిట్ తొలి రోజే బ్రిక్స్ సభ్య దేశాలు జాయింట్ స్టేట్‌మెంట్‌తో పాటు న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న యుద్ధాలు, అంతర్జాతీయ ఘర్షణలను దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. వివాదాలను మరింత పెంచకుండా శాంతియుత మార్గాలను అనుసరించాలని స్పష్టం చేశాయి. ఇదే సమయంలో అమెరికా టారిఫ్ విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ విధానాలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి. అంతేకాకుండా, సరిహద్దు ఉగ్రవాదం, టెర్రరిస్టులకు అందే ఆర్థిక సాయం, ఆశ్రయం వంటి సవాళ్లను ఐక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించారు.
మొదటి రోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ అతిథుల గౌరవార్థం ప్రత్యేక గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు వివిధ దేశాల అధినేతలతో పాటు కేంద్ర మంత్రులు, 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లోక్‌సభ స్పీకర్ హాజరయ్యారు. అతిథులకు రకరకాల భారతీయ సాంప్రదాయ వంటకాలు, మిఠాయిలను వడ్డించారు. అయితే, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ స్వదేశానికి తిరిగి వెళ్లగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విశ్రాంతి కోసం హోటల్‌కు వెళ్లడంతో ఈ విందుకు హాజరు కాలేకపోయారు.
BRICS Summit | బ్రిక్స్ సమ్మిట్ ప్రాధాన్యత..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్రను మరింత పెంచడం, గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలను అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. భారత్ సారథ్యంలో జరుగుతున్న ఈ సదస్సు ద్వారా ఆర్థిక, రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది.
ఇది కూడా చదవండి: Arya Vaishyas Bhavan | ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి : సీఎం రేవంత్‌రెడ్డి