Telangana Government Schools | పాఠశాలల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి.. సీఎం రేవంత్‌కు మేధావుల ఘాటు లేఖ

తెలంగాణలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదించి, మిగిలిన బడులను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Government Schools | తెలంగాణలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదించి, మిగిలిన బడులను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ప్రకటనపై విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్ బి. చంద్రకుమార్, జస్టిస్ రాధారాణి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న వంటి ప్రముఖుల సంతకాలతో సమర్పించిన ఈ లేఖలో, 23,000 పాఠశాలల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని , ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. జూన్ 6న బెంగళూరులో జరిగిన చర్చా కార్యక్రమంలో సీఎం చేసిన ఈ ప్రకటన తీవ్ర విద్యా, సామాజిక పరిణామాలకు దారితీస్తుందని వారు హెచ్చరించారు.

Telangana Government Schools | విద్యాహక్కు చట్టం ఉల్లంఘన..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 27A , విద్యాహక్కు చట్టం ప్రకారం, పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని మేధావులు గుర్తు చేశారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, సుమారు 500 గ్రామ పంచాయతీలలో పాఠశాలలు దూరమవుతాయని, రవాణా , భద్రతా కారణాల దృష్ట్యా విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలోనే మానేసి బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ చరిత్రలోనే అత్యంత తిరోగమన చర్యగా మిగిలిపోతుందని వారు ఆవేదన చెందారు.
revanth.4

Telangana Government Schools | ఎన్నికల హామీల ఉల్లంఘన..

ఎన్నికల మేనిఫెస్టోలో విద్యను భవిష్యత్తుపై పెట్టుబడిగా పరిగణిస్తామని, బడ్జెట్‌లో 15% నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కానీ, ఇప్పుడు ఆ నిధుల కేటాయింపుల ఊసే లేదని లేఖలో తప్పుబట్టారు. గత ప్రభుత్వం మూసివేసిన 6,000 పాఠశాలలను తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా 23,000 పాఠశాలలను మూసివేయాలని చూడటం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి పాలకుల నిర్లక్ష్యం , విద్యాశాఖలోని పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని గణాంకాలతో సహా వివరించారు.

Telangana Government Schools | మేధావులు కోరిన తక్షణ చర్యలు..

బడుల మూసివేత ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రతి చిన్న గ్రామంలో ప్రాథమిక పాఠశాలను కొనసాగిస్తూ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను (Pre-Primary) ప్రారంభించాలి. పాఠశాలల్లో తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు , డిజిటల్ వసతులను కల్పించాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకూడదు. ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ప్రైవేటు పాఠశాలలను కట్టడి చేసేందుకు జీవో నెంబర్ 1ను పకడ్బందీగా అమలు చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని, కావున ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించుకోవాలని మేధావులు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి:  Hussain Sagar FTL | ఎఫ్​టీఎల్​ పరిధిలో 17 అంతస్తుల భవనం.. నోటీసులు జారీ చేసిన జీహెచ్​ఎంసీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *