అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MeeSeva Door Delivery | మీ సేవ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ఇప్పటికే వాట్సాప్ (WhatsApp) ద్వారా మీ సేవ సేవలను ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా డోర్ డెలివరీ సేవలను సైతం ప్రారంభించింది.
రాష్ట్ర ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా మీ సేవ సర్వీసులు అందించేందుకు ప్రభుత్వం మీ సేవ డోర్ డెలివరీ సర్వీసులు తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం ఈ సేవలను ప్రారంభించారు. దీంతో ఇక నుంచి కేంద్రాలకు వెళ్లకుండా సేవలను పొందొచ్చు. దీంతో ప్రజల సమయం ఆదా కానుంది.
MeeSeva Door Delivery | స్లాట్ బుక్ చేసుకోవాలి
మీ సేవ డోర్ డెలివరీ సర్వీసుల కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. 1100కు ఫోన్ చేసి లేదా, మీ సేవ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే మీ సేవ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి సేవలు అందిస్తారు. ఇంటి దగ్గరే జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈసీ కాపీలు, పోలీస్ శాఖ సేవలు సైతం ఇంటి వద్ద పొందొచ్చు. ఈ సేవల కోసం 70 మందికి పైగా మీసేవ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. తొలి దశలో ఎంపిక ప్రాంతాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా డోర్ డెలివరీ సేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Kavitha RIMS Fire| నెల రోజుల్లోగా డిమాండ్లు నెరవేర్చాలి.. రిమ్స్ ఘటనపై రేవంత్ రెడ్డికి కవిత అల్టిమేటం