అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Power Cuts | కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణలో ప్రతి చోట కరెంట్ కోతలు ఉన్నాయని రోజూ పత్రికల్లో వస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి సక్రమంగా కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌ల దగ్గరికి వెళ్లి చెక్ చేస్తే 6 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ప్రచారం చేశారన్నారు. అయితే తాము తెలంగాణ తెచ్చి, బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని ఆయన అన్నారు.
Telangana Power Cuts | మూతపడుతున్న విద్యుత్ కేంద్రాలు
తెలంగాణలో వారం రోజుల్లో 5 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూత పడ్డాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి నుంచి నాసిరకం బొగ్గు తెలంగాణకు ఇచ్చి, ఏపీ, తమిళనాడులకు నాణ్యమైన బొగ్గు తరలిస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణి నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అయింది హరీశ్‌రావు బయటపెట్టారన్నారు. అయితే ఆనాడు బొగ్గు ఎక్కడికి పోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం బుకాయించిందని పేర్కొన్నారు. బొగ్గు ఎక్కడికి పోకపోతే ఇప్పుడు థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. 4,000 సామర్థ్యం ఉన్నా.. 400 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు.
Telangana Power Cuts | పవర్ స్టేషన్లను సందర్శిస్తాం
తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్లలో ఏం జరుగుతుందో నిజానిజాలు తేల్చడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆరు బృందాలు రేపు పవర్ స్టేషన్లకు వెళ్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర నల్గొండ నాయకులు వెళ్తారని, కొత్తగూడెం పవర్ స్టేషన్‌కు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బృందం, భద్రాద్రికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బృందం, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌కు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బృందం వెళ్తుందని తెలిపారు.
సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, సింగరేణి ప్రధాన కార్యాలయం పర్యటనకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు వెళ్తారని కేటీఆర్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: MeeSeva Door Delivery | మీసేవ డోర్ డెలివరీ సేవలు ప్రారంభం