అక్షరటుడే వెబ్డెస్క్: ICICI Prudential Nari Shakti | నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మహిళలకు తీపి కబురు అందించింది. ‘నారీశక్తి’ ప్రోగ్రామ్ కింద 2027 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది మహిళా సలహాదారులను (అడ్వైజర్లు) నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ వ్యాపారంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మొత్తం ఏజెన్సీ బిజినెస్లో 45 శాతం వాటా వారికే దక్కుతుందని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30, 2026 నాటికి కంపెనీలో 78 వేలకు పైగా మహిళా అడ్వైజర్లు విజయవంతంగా సేవలందిస్తున్నారు.
ICICI Prudential Nari Shakti | మహిళల బలం..|
ఈ సందర్భంగా ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమీష్ బ్యాంకర్ మాట్లాడుతూ.. ప్రతిభకు ఎలాంటి లింగభేదం ఉండదని తాము విశ్వసిస్తామని తెలిపారు. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడంలో మహిళా అడ్వైజర్లు ఎంతో ముందున్నారని, బెంగళూరు, కేరళ ( Kerala ), ముంబై వంటి నగరాల్లో వీరు 50 శాతానికి పైగా ఏజెన్సీ వ్యాపారాన్ని సాధించారని కొనియాడారు. గృహిణులు, ఉద్యోగినులు, మహిళా వ్యాపారవేత్తల్లో ఉండే మల్టీటాస్కింగ్, సమస్యల పరిష్కారం, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు ఇన్సూరెన్స్ రంగానికి ఎంతో కలిసివస్తున్నాయని పేర్కొన్నారు.
ICICI Prudential Nari Shakti | స్వయం ఉపాధి..
రెండేళ్ల క్రితం ప్రారంభించిన ‘నారీశక్తి’ ఇనిషియేటివ్ ద్వారా మహిళలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎలాంటి ముందస్తు పెట్టుబడి లేకుండానే మహిళలు గౌరవప్రదమైన ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా ఎదిగేందుకు, కుటుంబ సమయానికి భంగం కలగకుండా స్వయం ఉపాధి పొందేందుకు ఇది చక్కటి వేదికగా నిలుస్తోంది. 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే ప్రభుత్వ లక్ష్య సాధనలో ఈ మహిళా శక్తి ఎంతగానో దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేసింది.
ఇప్పటికే కంపెనీలోని మహిళా అడ్వైజర్లలో 47 శాతం మంది పదేళ్లకు పైగా పనిచేస్తుండగా, 500 మందికి పైగా మహిళలు ప్రతిష్టాత్మక ‘మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్’ (MDRT) అర్హత సాధించడం విశేషం.
ఇది కూడా చదవండి: Kamareddy Red Cross | కామారెడ్డి రెడ్క్రాస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం