Kolkata Stampede | దుర్గాపూజ తొక్కిసలాటలో 19 మంది మృతి.. నిర్వాహకుల అరెస్ట్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kolkata Stampede | కోల్‌కతాలోని ఒక ప్రముఖ దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది మరణించగా, 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా పార్క్ పూజా పండాల్ ఎగ్జిట్​ గేట్​ దగ్గర శనివారం సాయంత్రం తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Kolkata Stampede | ఇరుకైన ద్వారాలతో..

10 రోజుల దుర్గా పూజ ఉత్సవంలో ఏడవ రోజైన సప్తమి ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రవేశ, బయటకు వచ్చే మార్గాలు ఇరుకుగా ఉండటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట తర్వాత, పండాల్ నిర్వాహకులు ప్రాంగణంలోకి ప్రవేశాన్ని నిలిపివేసి, లైట్లను ఆపివేశారు.

Kolkata Stampede | ఏడుగురి అరెస్ట్

ఈ ఘటనలో నిర్వాహకులతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చోర్‌బాగన్ దుర్గా పూజా కమిటీ కార్యదర్శి రాజ్ కుమార్ సేవ్డా, ఉపాధ్యక్షుడు శాంతను దుబేతో పాటు, వెదురు నిర్మాణం చేపట్టిన బిప్లబ్ ముఖర్జీ, జనసమూహాన్ని నియంత్రించే బాధ్యత వహించిన కౌశిక్ సాహా, పింటూ డే, మరియు ప్రైవేట్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌లు సుమన్ చక్రవర్తి, రాజేష్ పాల్​ను అదుపులోకి తీసుకున్నారు.

Kolkata Stampede | ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

తొక్కిసలాట ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పందించారు. ఆస్పత్రిని సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుఉంటామని హెచ్చరించారు. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన దుర్గా పూజా పండాల్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు, గ్రూప్ డి ప్రభుత్వ ఉద్యోగం అందిస్తామని తెలిపారు.

దీనిని కూడా చదవండి : CFB Wainwright Fire | సైనిక స్థావరంలో భారీ అగ్నిప్రమాదం.. పలువురికి గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *