Bengaluru Family Murders | వారం రోజులు.. ఏడు హత్యలు.. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ క్రూరత్వం

కర్ణాటక రాజధాని బెంగళూరులోని రాజాజీనగర్ పరిధిలోని భాష్యం సర్కిల్ సమీపంలో అత్యంత దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bengaluru Family Murders | కర్ణాటక రాజధాని బెంగళూరులోని రాజాజీనగర్ పరిధిలోని భాష్యం సర్కిల్ సమీపంలో అత్యంత దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో తీవ్ర కక్ష పెంచుకున్న 53 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ ఇందుశేఖర్, ఏకంగా తన భార్య కుటుంబానికి చెందిన ఏడుగురిని వారం రోజుల వ్యవధిలో క్రూరంగా అంతమొందించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Bengaluru Family Murders | రోకలిబండతో దాడి..

సుమారు 20 ఏళ్ల క్రితం సునీత అనే మహిళతో శేఖర్‌కు వివాహమైంది. అయితే భార్య తరచూ పుట్టింటికి వెళ్లడం, కుటుంబ సభ్యులు ఆమెకే మద్దతుగా నిలవడంతో కోపం పెంచుకున్న శేఖర్.. భార్య తరఫు వారిని పూర్తిగా మట్టుబెట్టాలని ప్లాన్ వేశాడు. మొదట భార్య సునీతను రోకలిబండతో బాది చంపి, మృతదేహాన్ని నంది హిల్స్ సమీపంలో పడేసి పొరుగువారికి ఆమె ట్రిప్‌కు వెళ్లిందని నమ్మబలికాడు. మరుసటి రోజు బావమరుదులు శివకుమార్, శంకర్‌లను పార్టీ పేరుతో ఇంటికి పిలిపించి హత్య చేశాడు. ఆ తర్వాత బావమరుదుల భార్యలు దివ్య, నళిని, అత్త రూపవతిలతో పాటు 7 ఏళ్ల మేనల్లుడు పూనిత్‌ను కూడా దారుణంగా అంతమొందించాడు.

Bengaluru Family Murders | సాక్ష్యాలను మాయం చేసేందుకు..

హత్యల అనంతరం ఇంటి గోడలు, నేలపై ఉన్న రక్తపు మరకలను రసాయనాలతో (Chemicals) శుభ్రం చేసి సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. కాగా, నళిని ఆచూకీ కానరాకపోవడంతో ఆమె తల్లి శ్రీరాంపుర పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు మిస్సింగ్ వివరాలను పరిశీలించి, కాల్ డేటా , ప్రవర్తన ఆధారంగా ఇందుశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

Bengaluru Family Murders | రోకలిబండ స్వాధీనం..

విచారణలో శేఖర్ ఏడు హత్యలు చేసినట్లు అంగీకరించాడు. దాడికి ఉపయోగించిన రోకలిబండతో పాటు మృతదేహాలను తరలించడానికి వాడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు, మిగిలిన ఆరు మృతదేహాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దారుణంలో నిందితుడితో పాటు కుటుంబానికి చెందిన మరొకరి ప్రమేయం ఉందేమో అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Husband Murder Case | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *