Dialysis Food Festival | మహబూబాబాద్‌లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ నిర్వహించిన నెఫ్రోప్లస్..

తెలంగాణలోని మహబూబాబాద్‌లో ఉన్న ధరణి హాస్పిటల్‌లో నెఫ్రోప్లస్ తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ నిర్వహించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Dialysis Food Festival | తెలంగాణలోని మహబూబాబాద్‌లో  ( Mahabubabad )ఉన్న ధరణి హాస్పిటల్‌లో నెఫ్రోప్లస్ తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స తీసుకుంటున్న రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో పాల్గొన్న రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు ఇంటరాక్టివ్ సెషన్లు, ఆచరణాత్మక ప్రదర్శనల ద్వారా తమకు తగిన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు. డయాలిసిస్ రోగులు కూడా పోషక విలువలతో పాటు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చని ఈ వేదిక చాటింది.

Dialysis Food Festival | మంది భాగస్వామ్యం..

ఈ ఆహారోత్సవంలో సుమారు 30 మంది పాల్గొన్నారు. ధరణి హాస్పిటల్‌లోని నెఫ్రోప్లస్ కేంద్రం నుంచి 20 మంది, సమీపంలోని ఇతర డయాలిసిస్ కేంద్రాల నుంచి 10 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులు హాజరయ్యారు. నిప్పు ఉపయోగించకుండా వంట చేసే (Fireless Cooking) కార్యకలాపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యామ్నాయ పదార్థాలు, సులభమైన వంట పద్ధతులతో రుచికరమైన, డయాలిసిస్‌కు అనుకూలమైన వంటకాలను తయారు చేసే విధానాలను ఇందులో వివరించారు. సాధారణ ఆహార పరిమితులకు మించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజువారీ భోజనంలో ఎలా చేర్చుకోవచ్చో రోగులు, సంరక్షకులు తెలుసుకున్నారు.

Dialysis Food Festival | పోషకాహార నియంత్రణ..

డయాలిసిస్ రోగుల ఆరోగ్యంలో పోషకాహారం ఎంతో కీలకం. వ్యక్తిగత వైద్య అవసరాలను బట్టి సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, ద్రవాలు, ప్రోటీన్ల పరిమాణాన్ని జాగ్రత్తగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. తగిన పదార్థాల ఎంపిక, ద్రవాల పరిమితి, ఉప్పు తగ్గింపు, సంప్రదాయ వంటకాల్లో మార్పులు వంటి సవాళ్లను అధిగమించే మార్గాలపై చర్చించారు. వైద్యుల సూచనలు పాటిస్తూనే విభిన్న రుచులను ఆస్వాదించవచ్చని తెలిపారు. ఇంట్లో భోజన ప్రణాళిక, వంటలో కుటుంబ సభ్యుల పాత్ర కీలకం కాబట్టి, ఇలాంటి కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడం అవసరమని పేర్కొన్నారు.

ఇతర కేంద్రాలకూ విస్తరించే యోచన: నెఫ్రోప్లస్ సీఈఓ
నాణ్యమైన డయాలిసిస్ చికిత్స అందించడంతో పాటు రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో రోగులకు సహాయపడటం తమ బాధ్యత అని నెఫ్రోప్లస్ గ్రూప్ సీఈఓ రోహిత్ సింగ్ తెలిపారు. పోషకాహార అవగాహన కేవలం సమాచారానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక పరిష్కారాలుగా మారాలని, తొలి ఆహారోత్సవం ద్వారా రోగులు, కుటుంబ సభ్యులు ఆలోచనలు పంచుకునే వేదికను కల్పించామని చెప్పారు. మహబూబాబాద్‌లో లభించిన స్పందన ఆధారంగా, ఇతర కేంద్రాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని సంస్థ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Chakratheertham Festival | భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం.. లింబాద్రిగుట్టపై ఆధ్యాత్మిక శోభ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *