అక్షరటుడే, వెబ్డెస్క్ : Free Health Checkup | దేశంలోని కోట్లాది మంది శ్రామికుల ఆరోగ్యం, సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లేబర్ కోడ్ల అమలులో భాగంగా 40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ నిర్ణయం అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కోట్లాది మందికి ప్రయోజనం కలిగించనుంది.
ఈ విషయాన్ని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. దశాబ్ద కాలంలో సామాజిక భద్రత కవరేజీ 30 కోట్ల నుంచి ఏకంగా 94 కోట్ల మందికి పెరిగిందని, ఇది దేశ జనాభాలో 19 శాతం నుంచి 64 శాతానికి చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 11 ప్రధాన ఈఎస్ ఐసీ ఆసుపత్రుల్లో (ESIC Hospital) ఏకకాలంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఫ్రీ హెల్త్ చెకప్ ద్వారా ఇటు శ్రమ శక్తి.. అటు యువ శక్తిని బలోపేతం చేయడమే కాకుండా పని ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించగలమని ప్రభుత్వం భావిస్తోంది.
Free Health Checkup | ఈఎస్ ఐసీ ఆస్పత్రుల ద్వారా సేవలు..
కార్మికుల గౌరవం, వారి సామాజిక భద్రతను బలోపేతం చేయడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఈ స్కీమ్ ప్రధానంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees’ State Insurance Corporation) పరిధిలోకి వచ్చే కార్మికులందరికీ వర్తిస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారు ఏటా ఉచితంగా హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. ముఖ్యంగా పది కంటే తక్కువ మంది పనిచేసే చిన్న సంస్థల్లోని ఉద్యోగులు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవారిని కూడా ఈఎస్ ఐసీ పరిధిలోకి తీసుకువచ్చారు.
సాధారణ తనిఖీలలో ఒకవేళ పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు బయటపడితే అవసరమైన మందులు, చికిత్సను ఈఎస్ ఐసీ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా పొందవచ్చు. మహిళా కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటికే ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. సమాన వేతనం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు హెల్త్ చెకప్స్ కూడా తోడవ్వడంతో మహిళా కార్మికులకు మరింత భద్రత చేకూరుతుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Law Order| హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్.. అందుకే రాష్ట్రంలో ఈ దారుణాలు: కేటీఆర్

