అక్షరటుడే, వెబ్‌డెస్క్: Saraswati Antya Pushkaralu | కాళేశ్వరంలో ఈనెల 21 వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు సుమారు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో పుష్కరాలకు హాజరయ్యేవారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
సరస్వతీ అంత్య పుష్కరాల ఏర్పాట్లపై డా.బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామ చంద్రన్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి, ఐ.జి చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Saraswati Antya Pushkaralu | ఉదయం 5.43 గంటలకు
ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మే 21 వ తేదీ ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠం స్వామి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ పుణ్య స్నానం ఆచరించి సరస్వతీ అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారని వెల్లడించారు.
ఈసారి దాదాపు 30 – 40 లక్షల మంది ఈ అంత్య పుష్కరాలకు హాజరయ్యే అవకాశం ఉందని, వారికి ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రధానంగా కాళేశ్వరం ఆలయంలో దర్శనాలు, పుష్కర స్నానాలకు వచ్చే వివిధ పీఠాధిపతులకు తగు ఏర్పాట్లు, పుష్కర ఘాట్ ల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
Saraswati Antya Pushkaralu | సాంస్కృతిక కార్యక్రమాలు
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మేడారం జాతర స్ఫూర్తితో సరస్వతి అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు.
ప్రతి రోజు ఒక ప్రముఖ పీఠం స్వామిజి ఈ పుష్కారాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారని, ఉదయం హోమాల నిర్వహణ, సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ అంత్య పుష్కరాల అనుభవాలు రానున్న గోదావరి పుష్కరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Saraswati Antya Pushkaralu | విస్తృతమైన మౌలిక సౌకర్యాలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు మాట్లాడుతూ.. ఈ అంత్య పుష్కరాలకు విస్తృతమైన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసినందున పెద్ద సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే అవకాశమున్నందున శానిటేషన్, ట్రాఫిక్, ప్రొటోకాల్, రవాణా, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.
Saraswati Antya Pushkaralu | రాష్ట్ర గవర్నర్ కూడా
రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. 2012 లో జరిగిన సరస్వతి పుష్కరాలకు కేవలం 2 లక్షల మంది మాత్రమే హాజరవగా, గత సంవత్సరం జరిగిన ఆది పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది హాజరయ్యారని వెల్లడించారు.
ఈ అంత్య పుష్కరాలలో ప్రతి రోజు హోమాలు, ఘాట్ వద్ద హారతి, సాంసృతిక కార్యక్రమాలు, తెప్పోత్సవం నిర్వహణతో పాటు పెద్ద పిండ ప్రదానాలు జరుగుతాయని అన్నారు. మొదటి రోజు కంచి స్వామిజీతోపాటు రాష్ట్ర గవర్నర్ కూడా పుణ్య స్నానాలకు హాజరవుతారని అన్నారు.
ఈసారి ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు మాట్లాడుతూ, అతిథి గృహాలు, 100 గదుల చౌల్ట్రీ, ఘాట్ వద్ద టెంట్ హౌస్ ల ఏర్పాటు, ప్రముఖులకు ఆహ్వానాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లకు రెవెన్యూ శాఖ సమన్వయం చేస్తుందని అన్నారు.
రవాణా శాఖ తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, షటిల్ బస్సులు నడపడం, రవాణా సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టిందన్నారు.
తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, ఘన వ్యర్థాల తొలగింపు వంటి ఏర్పాట్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ చేస్తుందని అన్నారు.
అలాగే, వైద్య ఆరోగ్య శాఖ 12 రోజుల పాటు వైద్య శిబిరాలు, అంబులెన్సులు, మందులు, అత్యవసర బృందాలను ఏర్పాటు చేస్తుందని, పోలీసు శాఖ తగిన పార్కింగ్ ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాల గుర్తింపు, రూట్ మ్యాపులు, లేఅవుట్ తయారీ, వాచ్ టవర్లు, సీసీటీవీ పర్యవేక్షణ, వాకీటాకీలు, మొబైల్ కనెక్టివిటీ, సూచిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని పేర్కొన్నారు.
ఈసమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామ చంద్రన్, జెన్ కో ఎండి హరీష్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి, భూపాల పల్లి ఎస్. పి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


