San Diego | శాన్ డియాగోలో కాల్పుల కలకలం.. మసీదు బయట ముగ్గురు మృతి, హేట్ క్రైమ్ కోణంలో దర్యాప్తు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : San Diego | అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగోలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. కాలిఫోర్నియా (California)లోని శాన్ డియాగో కౌంటీలో సోమవారం మధ్యాహ్నానికి ముందు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడి అతిపెద్ద ఇస్లామిక్ సెంటర్ ప్రాంగణం వెలుపల ఒక్కసారిగా కాల్పులు జరగడంతో తీవ్ర భయాందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్థలంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఒకరు సెక్యూరిటీ గార్డు ఉన్నారని, ఆయన ధైర్యంగా స్పందించడం వల్ల మరింత పెద్ద ప్రమాదం తప్పి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

San Diego | కాల్పుల అనంత‌రం ఆత్మ‌హ‌త్య‌..

కాల్పులు జరిగిన కొద్దిసేపటికే సమీపంలోని ఓ వీధిలో పార్క్ చేసిన కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒకరి వయసు 17 సంవత్సరాలు కాగా, మరొకరి వయసు 19 సంవత్సరాలు అని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ముగ్గురిపై కాల్పులు జరిపిన అనంతరం వారు తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అధికారులు కొన్ని కీలక వివరాలను కూడా గుర్తించారు. నిందితుల్లో ఒకరు తమ ఇంటి నుంచి తల్లిదండ్రులకు చెందిన తుపాకీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అలాగే జాతి వివక్ష భావజాలాన్ని ప్రస్తావిస్తూ రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు సమాచారం. వారి వద్ద ఉన్న ఆయుధాల్లో ఒకదానిపై విద్వేషపూరిత సందేశాలు రాసి ఉన్నాయని అధికారులు తెలిపారు.

San Diego | మరో కాల్పుల ఘటన

ఈ ఘటనపై దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. స్థానిక పోలీసులతో పాటు ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా కేసు దర్యాప్తులో పాల్గొంటోంది. ఇది హేట్ క్రైమ్ కిందకు వస్తుందా అనే అంశాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఇక ఘటన సమయంలో మసీదు ప్రాంగణంలో ఉన్న పాఠశాలలోని పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని శాన్ డియాగో పోలీస్ అధికారులు తెలిపారు. వారికి ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. అయితే మసీదు సమీపంలో మరో కాల్పుల ఘటన జరిగినట్లు కూడా సమాచారం అందిందని, ఆ సంఘటనకు ఈ కేసుతో సంబంధం ఉందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి..: India Norway business summit | భారత్, నార్వేల మధ్య అపారమైన పెట్టుబడి అవకాశాలు: నార్వే వ్యాపార సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *