Cockroach Janata Party viral | ‘బొద్దింక’ రాజ్యం: ఎక్స్ అకౌంట్ ఊడినా.. ఆగని జెన్-జీ ‘కాక్రోచ్’ వీరంగం.. ప్రతిపక్షాల ‘కీటక’ ప్రేమాంజలి!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cockroach Janata Party viral | రాజకీయాల్లో సింహాలు, ఏనుగులు, సైకిళ్లు, కమలాలు.. వీటన్నింటికీ కాలం చెల్లిపోతుందా? ఇప్పుడు ట్రెండ్ మారింది. పాలిటిక్స్ లోకి సరికొత్తగా ఓ ‘కీటకం’ ప్రవేశించింది.

అదే.. సోషల్ మీడియాను కుదిపేస్తోన్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP). నిరుద్యోగ యువతను ఉద్దేశించి దేశ అత్యున్నత స్థాయి నుంచి వచ్చిన ఒక వివాదాస్పద వ్యాఖ్యను అస్త్రంగా చేసుకుని, కేవలం ‘నవ్వులాట’ కోసం పుట్టిన ఈ డిజిటల్ బొద్దింక.. ఇప్పుడు అధికార పీఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార పక్షాల ఫాలోవర్ల రికార్డులను చెదలు పట్టించేస్తూ, దేశంలోనే మోస్ట్ ట్రెండింగ్ ‘ప్యారడీ’ పార్టీగా అవతరించింది.

Cockroach Janata Party viral | తొక్కితే పడేది కాదు.. ‘డిజిటల్’ బొద్దింక!

వ్యవస్థపై ఉన్న అసహనాన్ని, నిరుద్యోగ నిరాశను వ్యంగ్యంగా మార్చి రీల్స్, మీమ్స్ రూపంలో వదులుతుండటంతో ఈ సరికొత్త సైన్యం స్పీడు చూసి ‘పాలకులకు’ ఎక్కడో కాలినట్టుంది.

ఫలితంగా.. ఈ పార్టీకి సంబంధించిన ప్రధాన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాను భారతదేశంలో కనిపించకుండా ‘బ్లాక్’ (విత్‌హెల్డ్) చేయించారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

బొద్దింకల ప్రత్యేకత ఏంటో తెలుసుగా? ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకుని జీవించగలవు!

“ఒక్క అకౌంట్ క్లోజ్ చేస్తే ఏంటి.. వంద అకౌంట్లు పుట్టుకొస్తాయి” అన్నట్టుగా నెటిజన్లు ప్రత్యామ్నాయ అకౌంట్లతో విరుచుకుపడుతున్నారు.

సరికొత్త ఖాతా ఓపెన్ చేసి, “మేం మళ్లీ వచ్చేశాం.. మమ్మల్ని అంత తేలిగ్గా వదిలించుకోలేరు, లోల్ (Lol)” అంటూ పాలకులకు డిజిటల్ వెక్కిరింతలు మొదలుపెట్టారు. వీటికి గంటల వ్యవధిలోనే వేలాదిగా ఫాలోవర్లు పెరుగుతుండటం గమనార్హం.

akshara today .jpgCJP

Cockroach Janata Party viral | ఏమిటీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)!

“దేశంలో నిరుద్యోగులు బొద్దింకల్లా తయారయ్యారు” అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలు దేశంలోని నిరుద్యోగ యువతను తీవ్రంగా గాయపరిచాయంటున్నారు. ఆ అవమానాన్నే ఒక ఆయుధంగా మార్చుకున్నట్లు చెబుతున్నాడు అభిజీత్ దీష్కే అనే నిరుద్యోగ యువకుడు.

బొద్దింక ఎంతటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకుని జీవించగలదు.. అలాగే తాము కూడా వ్యవస్థ నిర్లక్ష్యాన్ని తట్టుకుని నిలబడతామంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ప్రకటించి, సరికొత్త పొలిటికల్ సంచలనానికి తెరలేపాడు.

Cockroach Janata Party viral | పార్టీలో చేరాలంటే ‘వింత’ అర్హతలు!

సాధారణ పార్టీల్లో చేరాలంటే సేవాభావం, నిబద్ధత అడుగుతారు. కానీ CJP కండిషన్లు చాలా విచిత్రంగా, యువతను ఆకర్షించేలా ఉన్నాయి:

  • నిరుద్యోగి అయి ఉండాలి.
  • కొంత సోమరితనం (వ్యవస్థను చూసి విసిగిపోయిన నైరాశ్యం) ఉండాలి.
  • ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ధైర్యం ఉండాలి.
  • అన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియాకు అతుక్కొని ఉండాలి.

ఈ డిజిటల్ కండిషన్లే జెన్-జీ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఫలితంగా కేవలం 46 గంటల్లోనే లక్ష మంది డిజిటల్ సభ్యత్వాలు తీసుకుని రికార్డు సృష్టించారు.

దేశంలో ఉద్యోగాల కొరతపై యువత ఎంతటి తీవ్ర ఆగ్రహంతో ఉందో ఈ పార్టీ రిజిస్ట్రేషన్ల వేగం చెబుతోంది. సీరియస్ రాజకీయాలకు భిన్నంగా ‘బొద్దింక’ అనే వ్యంగ్య అస్త్రాన్ని వాడటం ద్వారా జెన్-జీ సమాజం తమ నిరసనను వినూత్నంగా తెలియజేస్తోంది.

Cockroach Janata Party viral | మేనిఫెస్టో…

వీరి డిమాండ్లు కూడా పదునుగా ఉన్నాయి. “ఏ చీఫ్ జస్టిస్ కూడా రిటైర్ అయ్యాక రాజ్యసభ సీటు తీసుకోకూడదు”, “పార్లమెంట్‌లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి”, “పార్టీలు మారే ఎమ్మెల్యే, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల నిషేధం విధించాలి” అంటూ నవ్వుల వెనుక పదునైన రాజకీయ సంస్కరణలను డిమాండ్ చేస్తున్నారు.

akshara today .jpgCJP 2

Cockroach Janata Party viral | రూలింగ్ పార్టీ కంటే ఎక్కువే!

ఈ పార్టీకి కేవలం ఆన్‌లైన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు, రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ సునామీ: ప్రారంభించిన కేవలం 5 రోజుల్లోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 20 మిలియన్ల (2 కోట్లు) ఫాలోవర్లను దాటేసింది!

బీజేపీ కంటే దూకుడు: వేల పోస్టులతో దేశాన్ని ఏలుతున్న అధికార భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను (8.7 మిలియన్లు) కేవలం 50 పోస్టులతో ఈ ‘బొద్దింక’ పార్టీ దాటేయడం డిజిటల్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది.

ఆఫ్‌లైన్ రచ్చ: ఈ ఉద్యమం కేవలం ఫోన్లకే పరిమితం కాలేదు. యువకులు బొద్దింక కాస్ట్యూమ్స్ (దుస్తులు) వేసుకుని రోడ్లపైకి వచ్చి మరీ నిరసనలు తెలుపుతూ, క్లీనింగ్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ థియేట్రికల్ పాలిటిక్స్ చూపిస్తున్నారు. బీహార్‌లో జరగబోయే బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టే యోచనలో కూడా ఉన్నారట!

Cockroach Janata Party viral | ప్రతిపక్షాల మద్దతు!

ఇదిలా ఉంటే, యువత నడుపుతున్న ఈ డిజిటల్ పేరడీ ఉద్యమాన్ని చూసి ప్రతిపక్షాలు కూడా తరించిపోతున్నాయి. యువత గళాన్ని నొక్కేయడం కుదరదంటూ రాజకీయ ప్రముఖులు రంగంలోకి దిగుతున్నారు.

“ఇది జెన్-జీ (GenZ)ల గళం.. వారి ఆవేదనను, డిమాండ్లను అధికార పక్షం వినాల్సిందే” అని డీఎంకే ఎంపీ కనిమొళి పార్లమెంటరీ శైలిలో గట్టిగానే సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ చేసిన వారిలో సింగర్ చిన్మయి, కమెడియన్ వీర్ దాస్ కూడా ఉన్నారు.

మరోవైపు, కేంద్ర విద్యాశాఖను టార్గెట్ చేస్తూ ‘నీట్’ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఈ ‘కాక్రోచ్ పార్టీ’ డిమాండ్ చేయడమే ఆలస్యం.. వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ దీనికి తనదైన శైలిలో మద్దతు ప్రకటించారు.

“కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ బిగాట్స్ (మతోన్మాద) జనతా పార్టీ” అంటూ ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు జోడించి, “యువత శక్తా మజాకా.. వారు తిరగబడతారు.. తమ హక్కులను సాధించుకుంటారు..” అంటూ సదరు కీటక సైన్యానికి ‘జస్ట్ ఆస్కింగ్’ బ్రాండ్ మద్దతు పలికారు.

సంఘ విద్రోహ శక్తుల ఎంట్రీ..?

కాక్రోచ్​ల సంగతేమిటో కానీ, ఆ ముసుగులో సంఘ విద్రోహులు ఏంట్రీ అవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వమే లక్ష్యంగా చేసుకుని మన దేశంలోని కొందరితోపాటు పాకిస్తాన్​, ఇతర దేశాలకు చెందిన వారు అస్త్ర శస్త్రాలు విసురుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, దేశ సౌర్యభౌమాధికారాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Cockroach Janata Party viral | వ్యవస్థకు పట్టిన చెదను వదిలిస్తుందా?

నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ఐటీ దాడులు, సోషల్ మీడియా సెన్సార్‌షిప్ వంటి సీరియస్ అంశాలను అత్యంత హాస్యాస్పదంగా, వ్యంగ్యంగా చూపిస్తూ ఈ వినూత్న విప్లవం దూసుకుపోతోంది.

ప్రభుత్వాలు ఎంతలా అకౌంట్లను బ్యాన్ చేస్తున్నా, దేశంలో 29 శాతానికి పైగా ఉన్న గ్రాడ్యుయేట్ నిరుద్యోగ యువతలో నిగూఢంగా ఉన్న అసంతృప్తి ఈ ‘బొద్దింక పార్టీ’ రూపంలో పాలకులకు ప్రతిరోజూ పీడకలగా మారుతోంది.

నిజమైన బొద్దింకలు వంటగదికే పరిమితం కావచ్చు, కానీ ఈ ‘డిజిటల్ బొద్దింకలు’ మాత్రం రేపటి దేశ రాజకీయాల దిశను మార్చినా ఆశ్చర్యం లేదు!

Cockroach Jantha Party | నిరుద్యోగుల ‘బొద్దింక’ గర్జన: దేశ రాజకీయాల్లో ‘జెన్-జీ’ ప్రకంపనలు.. కొత్తగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *