అక్షరటుడే, వెబ్‌డెస్క్: Adhika Jyeshta Masam | జ్యోతిషశాస్త్రంలో అత్యంత పవిత్రమైన, అరుదైన కాలంగా భావించే ‘అధిక మాసం’ (పురుషోత్తమ మాసం) ఈ ఏడాది రాబోతోంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చాంద్రమాన జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వస్తోంది.
2026 మే 17 (ఆదివారం) నుంచి జూన్ 15 (సోమవారం) వరకు ఉంటుంది. సుమారు మూడేళ్లకు ఒకసారి వచ్చే ఈ అధిక మాసానికి ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యం ఉందో, దేశ కాల పరిస్థితులపై అంతటి బలమైన ప్రభావం ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఒకే ఏడాది రెండు జ్యేష్ఠ మాసాలు రావడం వల్ల దేశంలో పెద్ద మార్పులు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు అందరిలోనూ దీనిపై ఆసక్తి పెరిగింది.
Adhika Jyeshta Masam | అధిక మాసం ఎందుకు వస్తుంది?
భారతీయ కాలగణన ప్రకారం.. సూర్యుడి గమనాన్ని బట్టి సౌర సంవత్సరం (365 రోజులు), చంద్రుడి గమనాన్ని బట్టి చాంద్ర సంవత్సరం (354 రోజులు) లెక్కిస్తారు.
ఈ రెండింటి మధ్య ఏటా వచ్చే 11 రోజుల తేడాను సమన్వయం చేయడానికి మన శాస్త్రకారులు ఈ ‘అధిక మాస’ విధానాన్ని రూపొందించారు.
ఏ చాంద్రమాసంలోనైతే సూర్య సంక్రాంతి (సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడం) జరగదో.. దానిని అధిక మాసంగా పరిగణిస్తారు. సాధారణంగా ప్రతి 28 నుంచి 36 నెలల మధ్య ఒకసారి అధికమాసం వస్తుంది.
Adhika Jyeshta Masam | జ్యేష్ఠ అధిక మాస ఫలితం..
శాస్త్ర గ్రంథాల ప్రకారం (జ్యేష్ఠద్వయే నృపధ్వంసో ధాన్యానిక్షితిసత్తమే) ఒకే సంవత్సరంలో రెండు జ్యేష్ఠ మాసాలు వస్తే దేశంలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతాయి.
దేశాధినేతల మధ్య విభేదాలు, ప్రభుత్వాలలో అకస్మాత్తుగా మార్పులు, ప్రముఖ నేతలకు పదవీచ్యుతి లేదా రాజకీయ సంక్షోభాలు రావచ్చు. ప్రజలు కొత్త రకమైన వ్యాధులు, ఇబ్బందుల బారిన పడే అవకాశం కూడా ఉంది.
అయితే, ప్రకృతి పరంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, ధాన్యపు దిగుబడి అద్భుతంగా ఉంటుంది. సమాజంలో దానధర్మాలు, యజ్ఞాలు ఎక్కువగా జరుగుతాయి.
Adhika Jyeshta Masam | ఈ మాసంలో ఏం చేయాలి?
పురుషోత్తమ మాసంలో చేసే భగవదారాధనకు అనంతమైన ఫలితం లభిస్తుంది. ఈ నెల ప్రతిరోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి శ్రీకృష్ణుడిని, శ్రీమహావిష్ణువును ఆరాధించాలి.
విష్ణు సహస్రనామం, పురుష సూక్తం, ‘శ్రీ పురుషోత్తమ మహాత్మ్యం’ పఠించడం శ్రేయస్కరం. అలాగే, ఒకపూట మాత్రమే భోజనం చేయడం లేదా రాత్రి పూట మాత్రమే తినడం మంచిది.
నెయ్యి, బెల్లం, గోధుమలతో చేసిన 33 అప్పాలు లేదా అరిసెలు కంచు పాత్రలో ఉంచి దక్షిణతో సహా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల దారిద్ర్యం, పాపాలు తొలగిపోతాయి. మాసాంతంలో గుమ్మడికాయ, వస్త్రాలు, మిఠాయిలు దానం చేయాలి.
Adhika Jyeshta Masam | ఏం చేయకూడదు?
ఏదైనా స్వార్థంతో చేసే ఎలాంటి శుభకార్యాలైనా ఈ మాసంలో అస్సలు చేయకూడదు. ముఖ్యంగా వివాహాలు, నూతన గృహప్రవేశాలు వంటివి పూర్తిగా నివారించాలి. వీటితో పాటు కొత్తగా ఇళ్లు, భూములు, కొత్త వాహనాలు, ఆభరణాలు కొనడం చేయరాదు.
కొత్త తీర్థయాత్రలు ప్రారంభించడం, దేవతా ప్రతిష్ఠలు చేయడం, గుండు చేయించుకోవడం, వ్రతోద్యాపనలు చేయడం, కొత్త వస్త్రాలు ధరించడం లాంటి పనులకు ఈ నెల రోజులు దూరంగా ఉండటం శాస్త్రం ప్రకారం మంచిది..
Adhika Jyeshta Masam | వేటికి మినహాయింపు ఉంది?
కచ్చితంగా చేయాల్సిన కర్మలకు అధికమాస నిషేధం లేదు” అనే సూత్రం ప్రకారం నిత్య అవసరాలకు, పితృకార్యాలు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రతి సంవత్సరం పెద్దలకు పెట్టే తద్దినాలు (పిండ ప్రదానాలు), పుణ్యక్షేత్రాలలో చేసే శ్రాద్ధ కర్మలను ఎప్పటిలాగే నిశ్చింతగా చేసుకోవచ్చు.
అలాగే ప్రాణాపాయ పరిస్థితులు లేదా తీవ్ర అనారోగ్య నివారణకు చేసే రుద్ర జపాలు, గ్రహ శాంతి పూజలు చేయవచ్చు. శిశువు జన్మించిన తర్వాత చేసే నక్షత్ర గండ శాంతి, అన్నప్రాశన, పుట్టినరోజు పూజలు చేసుకోవచ్చు.
వీటన్నిటితో పాటు అధిక మాసానికి ముందే ప్రారంభించిన పనులను ఈ మాసంలో నిశ్చింతగా పూర్తి చేసుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Saraswati Antya Pushkaralu | ఈనెల 21 నుంచి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు


