అక్షరటుడే, వెబ్డెస్క్: Akshaya Navami 2026 | హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి (Karthika Masam) అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే పవిత్ర పండుగల్లో ‘అక్షయ నవమి’ (ఆమ్లా నవమి) ఒకటి. ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ బుధవారం రోజు అక్షయ నవమిని జరుపుకోనున్నారు.
నవమి తిథి నవంబర్ 18 ఉదయం 6:04 గంటలకు ప్రారంభమై, నవంబర్ 19 ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. పూజకు ఉదయం 6:46 నుంచి మధ్యాహ్నం 12:06 గంటల వరకు అత్యంత శుభ సమయంగా పండితులు వెల్లడించారు. ‘అక్షయ’ అంటే ఎప్పటికీ నశించనిది, శాశ్వతమైనది అని అర్థం. ఈ పర్వదినాన చేసే పూజలు, జపాలు, దానధర్మాలకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. అలాగే, కార్తీక శుక్ల నవమి రోజే సత్యయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతుండటంతో దీనిని ‘సత్యయుగాది నవమి’ అని కూడా పిలుస్తారు.
Akshaya Navami 2026 | ఉసిరి చెట్టు పూజ..
అక్షయ నవమి (Akshaya Navami) రోజున ఉసిరి చెట్టును పూజించడం వెనుక ప్రత్యేకమైన పౌరాణిక నేపథ్యం ఉంది. పూర్వం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఉసిరి చెట్టు కిందనే విష్ణుమూర్తి, శివుడిని పూజించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమె భక్తికి మెచ్చిన ఆ ఇద్దరు దేవుళ్లు ప్రత్యక్షం కాగా.. లక్ష్మీదేవి అదే చెట్టు కింద స్వయంగా వంట చేసి వారికి నైవేద్యం సమర్పించిందని విశ్వాసం. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ ప్రత్యేక రోజున భక్తులు ఉసిరి చెట్టుకు నీరు సమర్పించి, కుంకుమ, దీపాలతో పూజలు చేస్తారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, కాండానికి పవిత్ర దారం చుడతారు. కొందరు భక్తులు ఉసిరి చెట్టు కిందే వంట చేసి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి భోజనం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం చేకూరుతాయని, విష్ణు-లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం.
Akshaya Navami 2026 | దానధర్మాల ప్రాధాన్యత..
ఈ పవిత్ర దినాన దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తమ శక్తికొలది పేదలకు అన్నదానం, వస్త్రదానం, నిత్యావసరాల దానం చేయడం వల్ల అక్షయమైన పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. మరోవైపు, ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ బ్రజ్ ప్రాంతంలో అక్షయ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. మధుర, వృందావన్ వంటి శ్రీకృష్ణుడి లీలాక్షేత్రాలను కలుపుతూ సాగే ‘బ్రజ్ 84 కోసుల పరిక్రమ’ ఈ రోజునే ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం కోసం వేలాది మంది భక్తులు ఈ పవిత్ర యాత్రలో భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు.
ఇది కూడా చదవండి..: Nov 16 Horoscope | ఈ రాశుల వారికి నేడు అదృష్టం, ఆర్థికంగా లాభాలు మామూలుగా లేవుగా!