Employees Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకంలో కీలక మార్పులు.. రూ.3 లక్షల వరకు నగదు రహిత వైద్యం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Employees Health Scheme | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందించే ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఒకసారి పొందే వైద్య చికిత్సకు ఉన్న పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది.

అంతకుమించిన వైద్య వ్యయం ఉంటే రూ.10 లక్షల వరకు సబ్‌ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రూ.10 లక్షలు దాటిన కేసులకు ట్రస్టు బోర్డు ఆమోదం తప్పనిసరి చేసింది.

ఈ మేరకు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఎన్‌ఈహెచ్‌ఎస్‌ NEHS) మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పథకం ప్రారంభమైన జులై 17 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. చికిత్స వ్యయం ఎంత ఉన్నా వైద్య సేవలను నిరాకరించకూడదని స్పష్టం చేసింది.

Employees Health Scheme | సీజీహెచ్‌ఎస్‌ ప్యాకేజీ రేట్లే వర్తింపు

ఈహెచ్‌ఎస్‌లో 2025 అక్టోబరు నాటి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) ప్యాకేజీ రేట్లను అమలు చేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెల్‌నెస్‌ సెంటర్‌ సిఫారసు లేకుండానే నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో నేరుగా చేరవచ్చు. అయితే ఈ విషయాన్ని 48 గంటల్లోగా ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్టుకు తెలియజేయాలి.

University of London | హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ సుముఖత

కొత్త ఈహెచ్‌ఎస్‌ కార్డులు అందే వరకు ప్రస్తుత ఎంప్లాయీ లేదా పెన్షనర్‌ ఐడీ నంబర్‌ ఆధారంగా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్డు లేదనే కారణంతో చికిత్సను నిరాకరించకూడదని స్పష్టం చేసింది.

Employees Health Scheme | రూ.3 లక్షలు దాటితే సబ్‌ కమిటీ

రూ.3 లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సకు ఈహెచ్‌ఎస్‌ కార్డుతో నేరుగా సేవలు పొందవచ్చు. ఏడాదిలో ఎన్నిసార్లయినా చికిత్స పొందే అవకాశం ఉంటుంది. రూ.3 లక్షలు దాటిన కేసులను ట్రస్టు సీఈఓతో పాటు రొటేషన్‌ పద్ధతిలో మూడు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన సబ్‌ కమిటీ పరిశీలిస్తుంది.

వైద్య వ్యయం రూ.10 లక్షలు దాటితే ట్రస్టు బోర్డు అత్యవసర సమావేశంలో కేసును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.

Employees Health Scheme | అత్యవసర వైద్యానికి ప్రత్యేక వెసులుబాటు

రాష్ట్రం వెలుపల వైద్యం పొందాలంటే సాధారణంగా ట్రస్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

వెల్‌నెస్‌ కేంద్రాల్లో నగదు రహిత ఓపీ సేవలు, ప్రాథమిక వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో ఉంటాయి. సాధారణ అనారోగ్యాలతో పాటు కంటి, దంత, ఈఎన్‌టీ, పిల్లల వ్యాధులు, ఫిజియోథెరపీ, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌, గుండె, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన కన్సల్టేషన్‌, పరీక్షలు, మందుల సేవలను అందించనున్నారు.

Employees Health Scheme | ఆసుపత్రులు అదనపు ఛార్జీలు వసూలు చేయరాదు

ఎంప్యానెల్డ్‌ ఆసుపత్రులు రోగుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఉద్యోగి వేతన గ్రేడ్‌ ఆధారంగా ఏ, బి, సి కేటగిరీలుగా గదుల కేటాయింపు ఉంటుంది. అర్హతకు మించిన స్థాయి గదిని లబ్ధిదారుడు స్వయంగా కోరుకుంటే అదనపు ఖర్చును ఆయనే భరించాల్సి ఉంటుంది.

Employees Health Scheme | 33 జిల్లాల్లో వెల్‌నెస్‌ కేంద్రాలు

ప్రస్తుతం ఉన్న 12 వెల్‌నెస్‌ కేంద్రాలకు అదనంగా మరో 25 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 33 జిల్లాల్లో జిల్లా, ఏరియా, టీచింగ్‌ ఆసుపత్రుల పరిధిలో వెల్‌నెస్‌ సేవలు అందేలా చర్యలు చేపట్టనున్నారు.

క్లెయిమ్‌ల చెల్లింపుల్లో ‘ముందుగా వచ్చినవి ముందుగా’ విధానాన్ని అమలు చేయనున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అయితే వారిలో ఒక్కరు మాత్రమే కంట్రిబ్యూషన్‌ చెల్లించే అవకాశం కల్పించారు. ట్రస్టు బోర్డుకు జమయ్యే నిధులను ఇతర అవసరాలకు మళ్లించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Employees Health Scheme | ఆసుపత్రులతో సమన్వయ సమావేశం

ఈహెచ్‌ఎస్‌ సేవలపై ఆసుపత్రుల ప్రతినిధులు, ట్రస్టు సభ్యులతో సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌, ఎంప్యానెల్డ్‌ ఆసుపత్రుల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. అపోలో, కాంటినెంటల్‌, యశోద, కిమ్స్‌ తదితర ప్రముఖ ఆసుపత్రుల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

ఈహెచ్‌ఎస్‌ సభ్యులకు వైద్య సేవల్లో అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ఆసుపత్రుల ప్రతినిధులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం చెల్లించాల్సిన గత బకాయిలను ఇటీవల విడుదల చేయడంతో పాటు ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే వాటా కింద నెలకు రూ.88 కోట్ల చొప్పున మూడు నెలల నిధులు ట్రస్టు ఖాతాలో ఉన్నట్లు సమావేశంలో వెల్లడించారు.

Employees Health Scheme | ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ

ఈహెచ్‌ఎస్‌ కార్డులు, నగదు రహిత చికిత్స, చికిత్స నిరాకరణ, అదనపు వసూళ్లు, వైద్య సేవల నాణ్యత, గదుల కేటాయింపు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై రాష్ట్ర, జిల్లా, ఆసుపత్రి స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

చికిత్స నిరాకరణ, అదనపు వసూళ్లు, రోగుల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా వ్యవస్థను రూపొందించనున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *