అక్షరటుడే, వెబ్‌డెస్క్: Global Cost Cutting | అమెరికా (America), ఇరాన్‌ల మధ్య యుద్ధంతో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను తట్టుకునేందుకు అన్నిదేశాలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభంతో కుదేలైన చాలా దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు చేపట్టాయి. దాదాపు 40కి పైగా దేశాలు నెలరోజులుగా పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. పనిదినాలను తగ్గించడంతోపాటు వర్క్ ఫ్రం హోమ్ (Work from Home)కు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంనుంచి బయటపడేందుకు ఏ దేశాల్లో ఏ చర్యలు తీసుకుంటున్నారంటే..
Global Cost Cutting | చాలా దేశాల్లో వర్క్ ఫ్రం హోం..
అనేక దేశాలు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇండోనేషియాలో శుక్రవారం రోజున ఇంటి నుంచే పని చేయాలని సూచించింది. మయన్మార్ బుధవారాల్లో రిమోట్ వర్క్‌ను తప్పనిసరి చేసింది. వియత్నాం వ్యాపార సంస్థలు రిమోట్ వర్క్, ఆన్‌లైన్ సమావేశాలను ప్రోత్సహిస్తోంది. దక్షిణ కొరియా, మలేసియా, థాయ్‌లాండ్, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా సౌకర్యవంతమైన పని విధానాలను ప్రోత్సహిస్తున్నాయి.
Global Cost Cutting | పనిదినాల కుదింపు..
శ్రీలంకలో బుధవారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు మూసివేస్తున్నారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం (Philippines Government) అధికారులకు నాలుగు రోజుల పని దినాల్ని విధించింది. పాకిస్థాన్‌లో 4 రోజుల పని + 50 శాతం రిమోట్ వర్క్ విధానం అమలులో ఉంది.
Global Cost Cutting | విద్యుత్ వినియోగంపై..
విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల్లో ఏసీ ఉష్ణోగ్రతలపైనా చాలా దేశాలు పరిమితులు విధించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మసీదుల్లో ఏసీలను కనీసం 25 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువకు సెట్ చేయాలని ఆదేశించింది. మలేసియాలో 24 డిగ్రీలు, శ్రీలంకలో 26 డిగ్రీలపైనే ఏసీలు వినియోగించాలని ఆదేశాలు ఉన్నాయి. జోర్డాన్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై తాత్కాలిక నిషేధం కూడా అమలులో ఉంది. కంబోడియా, థాయ్‌లాండ్‌లలోనూ ఇలాంటి ఆదేశాలే అమలవుతున్నాయి. శ్రీలంకలో బిల్‌బోర్డ్‌లపై లైట్లను ఆపేస్తున్నారు.
Global Cost Cutting | ప్రయాణాలపైనా..
ప్రభుత్వ ప్రయాణాలపైనా అనేక దేశాలు నియంత్రణలు విధించాయి. జోర్దాన్, పాకిస్థాన్ విదేశీ పర్యటనలను పరిమితం చేశాయి. దక్షిణ కొరియాలో ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలకు సరి బేస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. టాంజానియాలో సమూహ బస్సు ప్రయాణాలను ప్రోత్సహిస్తున్నారు.
Global Cost Cutting | విద్యాసంస్థలకు సెలవులు, ఆన్‌లైన్ క్లాసులు..
విద్యాసంస్థల విషయంలో కూడా చాలా దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌లో విశ్వవిద్యాలయాలను తాత్కాలికంగా మూసివేయగా, పాకిస్థాన్‌లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. లావోస్‌లో వారానికి మూడు రోజులే తరగతులు నిర్వహించే విధానం అమలులో ఉంది. శ్రీలంక, పెరూ, బంగ్లాదేశ్‌లు పాఠశాల పనిదినాల్ని తగ్గించి, రిమోట్ లర్నింగ్‌ను పెంచాయి.
Global Cost Cutting | ఇంధన పొదుపు కోసం..
ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అనేక దేశాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆస్ట్రేలియా ‘ఎవ్రీ లిటిల్ బిట్ హెల్ప్స్’ పేరుతో ప్రచారం నిర్వహిస్తుండగా, సింగపూర్ తక్కువ విద్యుత్ వినియోగించే పరికరాలు ఉపయోగించే దిశగా తన ప్రజలను ప్రోత్సహిస్తోంది. నెదర్లాండ్స్, స్పెయిన్ వంటి దేశాలు సోలార్ ఎనర్జీ, హీట్ పంప్స్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.
విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడాన్ని, ప్రభుత్వ భవనాల్లో ఏసీల వినియోగాన్ని జోర్దాన్ తగ్గించింది.
బ్రిటన్‌లో చిరువ్యాపారులు ఎలక్ట్రిక్ హీటింగ్‌కు మారడానికి ఆర్థిక సహాయం పొందే బాయిలర్ అప్‌గ్రేడ్ పథకాన్ని ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: Flight Ticket Prices | ప్రయాణం ‘గగన’మే!.. గణనీయంగా పెరిగిన విమాన టికెట్ల ధరలు


