Gyanesh Kumar Removal | ఎన్నికల సంఘంలో రగులుతున్న వివాదం.. జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాల మరో ప్లాన్..!

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు మరోసారి దూకుడు పెంచాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gyanesh Kumar Removal | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు మరోసారి దూకుడు పెంచాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై చెలరేగిన వివాదం, ఎలక్షన్ కమిషన్ తీరుపై వ్యతిరేకత నేపథ్యంలో పార్లమెంట్‌లో తొలగింపు నోటీసు ఇవ్వడానికి విపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాలు ఈ రీతిలో నోటీసు ఇవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Gyanesh Kumar Removal | విపక్షాల గత ప్రయత్నాలు..

గతేడాది మార్చి 12న తొలిసారిగా రెండు సభల్లోనూ విపక్షాలు నోటీసులు ఇవ్వగా, వాటిని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు తిరస్కరించారు. ఆ తర్వాత ఏప్రిల్ 24న 73 మంది ఎంపీల సంతకాలతో రాజ్యసభలో మరో నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో కుమార్‌పై తొమ్మిది ఆరోపణలు చేస్తూ ఆయన ‘నిరూపితమైన అపచారం’ (ప్రూవ్‌డ్ మిస్‌బిహేవియర్) చేశారని పేర్కొనగా, అది ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు మూడోసారి రెండు సభల్లోనూ కొత్తగా నోటీసులు ఇవ్వాలని విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ లోపల కమిషనర్ల మధ్య తలెత్తిన విభేదాలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాల ఆధారంగా రూపొందించిన కొత్త నివేదికను ఈసారి ప్రధాన అస్త్రంగా మలచుకోనున్నాయి. సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో సుమారు 21 విపక్ష పార్టీలు సమావేశమై సంయుక్త వ్యూహాన్ని, కొత్త తొలగింపు నోటీసు రూపురేఖలను చర్చించనున్నాయి.

Gyanesh Kumar Removal | దేశవ్యాప్తంగా నిరసనలు..

జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఈసీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీ ( Delhi ), శ్రీనగర్, పట్నా, రాంచీ, జైపూర్ వంటి నగరాల్లో ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఢిల్లీలో ఈసీ హెడ్‌క్వార్టర్స్‌కు మార్చ్‌గా వెళ్తున్న ఆందోళనకారులపై భద్రతా సిబ్బంది వాటర్ క్యానన్లను ఉపయోగించారు. సెప్టెంబర్ 25న కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్నా, ఛండీగఢ్ సహా పలు రాజధాని నగరాల్లో భారీ నిరసనలు జరిగాయి. ఈ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఫామ్-6 మార్పులు, డిజిటల్ డేటాబేస్ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తం చేశారని, ఇది తీవ్రమైన అంశమని ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

Gyanesh Kumar Removal | ఎలక్షన్ కమిషన్, బీజేపీ స్పందన..

విపక్షాల ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఖండించింది. కమిషన్ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నంత మాత్రాన సంస్థ పనితీరు దెబ్బతిన్నట్లు కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థల్లో భిన్నాభిప్రాయాలు సాధారణమేనని, ఎస్‌ఐఆర్‌కి సంబంధించిన నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని పేర్కొంది. సుప్రీంకోర్టు కూడా ఫామ్-6 మార్పులను సమర్థించిందని తెలిపింది. గత 10 నెలల కాలంలో ఇతర కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు కనీసం 14 అధికారిక అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వచ్చిన పత్రికా కథనమే ఈ రాజకీయ దుమారానికి కారణమైంది. అధికార బీజేపీ మాత్రం ఈసీ చర్యలను సమర్థిస్తూ, సంస్థల్లో భిన్నాభిప్రాయాలు సహజమని పేర్కొంటోంది.

ఇది కూడా చదవండి:  Train Accident | రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *